Dubai Duty Free Raffle: భారతీయుడికి కలిసొచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.7.82కోట్లు!

ABN , First Publish Date - 2022-06-23T17:51:17+05:30 IST

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 62 ఏళ్ల ఓ భారత వ్యక్తికి అదృష్టం కలిసి రావడంతో జాక్‌పాట్ కొట్టాడు.

Dubai Duty Free Raffle: భారతీయుడికి కలిసొచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.7.82కోట్లు!

అబుదాబి: దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 62 ఏళ్ల ఓ భారత వ్యక్తికి అదృష్టం కలిసి రావడంతో జాక్‌పాట్ కొట్టాడు. ఒమన్‌లో ఉండే జాన్ వర్ఘీస్ అనే భారతీయుడు బుధవారం దుబాయ్ ఎయిర్ పోర్టులో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా (Dubai Duty Free Millennium Millionaire draw)లో ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ.7.82కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో వర్ఘీస్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మిలీనియం మిలియనీర్ సిరీస్ నం. 392లో భాగంగా అతడు మే 29న ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం. 09827కు ఈ జాక్‌పాట్ తగిలింది. కాగా, వర్ఘీస్ గత ఆరేళ్ల నుంచి క్రమం తప్పకుండా రాఫెల్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. కేరళ రాష్ట్రానికి చెందిన అతడు 35 ఏళ్ల నుంచి అరబ్ దేశాల్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం మస్కట్‌లోని పాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (FMCG) అనే కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. 


దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఒక మిలియన్ డాలర్లు గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. కలలో కూడా ఇంత భారీ మొత్తం గెలుస్తానని అనుకోలేదని వర్ఘీస్ పేర్కొన్నాడు. ఈ నగదులో కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మరికొంత భాగాన్ని తన భవిష్యత్ ప్రణాళికకు ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే కొంత మొత్తాన్ని చారిటీకి వినియోగిస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులకు వర్ఘీస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా, 1999లో ప్రారంభమైన Dubai Duty Free Raffle లో ఇప్పటివరకు మొత్తం 192 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. ఇందులో వర్ఘీస్ 192వ ఇండియన్. ఇదిలాఉంటే.. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌ లాటరీ టికెట్లు కొనుగోలు చేసే వారిలో భారతీయులే టాప్‌లో ఉన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.     

Updated Date - 2022-06-23T17:51:17+05:30 IST