పాక్, టర్కీ విద్యార్థులను కాపాడిన భారత జాతీయ జెండా

ABN , First Publish Date - 2022-03-02T20:14:55+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పాకిస్థానీ, టర్కిష్ పౌరులు భారత

పాక్, టర్కీ విద్యార్థులను కాపాడిన భారత జాతీయ జెండా

కీవ్ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పాకిస్థానీ, టర్కిష్ పౌరులు భారత దేశ జాతీయ పతాకాన్ని రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. రష్యా యుద్ధం  ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ నుంచి తప్పించుకోవడానికి విదేశీయులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం భారతీయులను, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కట్టుదిట్టంగా ప్రయత్నిస్తోంది. భారత దేశ జాతీయ జెండాను స్పష్టంగా కనిపించేలా ఉంచుకుంటే ఇబ్బందులు తలెత్తబోవని భారతీయులకు సూచనలు అందాయి.  ఈ సలహాను పాకిస్థాన్, టర్కీ జాతీయులు తమ ప్రాణాలను కాపాడుకుంటూ, ఉక్రెయిన్ నుంచి బయటపడటానికి ఉపయోగించుకుంటున్నారు. 


ఉక్రెయిన్‌లో ఉంటున్న పాకిస్థానీ, టర్కిష్ పౌరులు ఆ దేశం నుంచి పొరుగు దేశాలకు వెళ్ళిపోయేందుకు చాలా శ్రమించవలసి వస్తోంది. భారతీయులకు అందిన సూచన వీరికి బాగా కలిసొచ్చింది. ఓ వార్తా సంస్థ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రొమేనియాకు చేరుకున్న భారతీయులు ఈ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. ఉక్రెయిన్‌లోని వివిధ చెక్‌పాయింట్లను దాటుకుని పొరుగు దేశాలకు వెళ్ళిపోవడానికి పాకిస్థానీ, టర్కిష్ జాతీయులకు భారత దేశ జాతీయ పతాకం బాగా ఉపయోగపడిందని చెప్పారు. 


యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో చురుగ్గా వీరిని తీసుకొస్తోంది. స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిరిండియా, భారత సైన్యం విమానాలను పంపించి, భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది. 


ఉక్రెయిన్‌లోని ఓడెసా నుంచి రొమేనియాకు వచ్చిన ఓ భారతీయ విద్యార్థి మాట్లాడుతూ, భారత దేశ జాతీయ పతాకాన్ని దగ్గర ఉంచుకుంటే ఎటువంటి సమస్యలు తలెత్తబోవని తమకు చెప్పారన్నారు. కర్టెన్లు, రంగులను కొని, త్రివర్ణ పతాకాన్ని తయారు చేశామని  తెలిపారు. దీనిని గమనించిన పాకిస్థానీ, టర్కిష్ విద్యార్థులు కూడా ఇదే విధంగా భారత దేశ జాతీయ జెండాలను తయారు చేసుకుని, ఉపయోగించుకుని, సురక్షితంగా చెక్ పాయింట్లను దాటారని తెలిపారు. 


ఓడెసా నుంచి వచ్చిన మరికొందరు విద్యార్థులు మాట్లాడుతూ, మోల్డోవా ప్రజలు తమకు చాలా సహకరించారని చెప్పారు. తమకు వసతి సదుపాయం, రవాణా సదుపాయం కల్పించారని చెప్పారు. 


ఇదిలావుండగా, మన దేశం ఉక్రెయిన్‌కు మందులు, ఆహార పదార్థాలు వంటి మానవతావాద సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. భారత వాయు సేనకు చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం మానవతావాద సాయంతో బుధవారం ఉదయం రొమేనియాకు బయల్దేరింది. తిరుగు పయనంలో ఈ విమానం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొస్తుంది. 


Updated Date - 2022-03-02T20:14:55+05:30 IST