మోదీతో అనుబంధంగల వ్యక్తికి హజ్ యాత్రలో కీలక బాధ్యతలు... సౌదీ అరేబియాపై ముస్లింల మండిపాటు...

ABN , First Publish Date - 2022-06-18T01:12:12+05:30 IST

పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ప్రాసెస్

మోదీతో అనుబంధంగల వ్యక్తికి హజ్ యాత్రలో కీలక బాధ్యతలు... సౌదీ అరేబియాపై ముస్లింల మండిపాటు...

దుబాయ్ : పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ప్రాసెస్ చేసే బాధ్యతలను సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రభుత్వం ఓ కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ పెట్టుబడిదారుల్లో ఒకరికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌లతో మంచి అనుబంధం ఉందని తెలియడంతో ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


హజ్ (Hajj) యాత్ర సందర్భంగా నకిలీ ట్రావెల్ ఏజెన్సీలను నిరోధించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా, యూరోప్, అమెరికా దేశాల నుంచి హజ్ యాత్రకు వచ్చేవారు ప్రభుత్వ పోర్టల్ మొటావిఫ్ (Motawif) ద్వారా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని గత వారం ప్రకటించింది. ఎంపికైనవారు తమ ప్లేస్‌ను ఆటోమేటెడ్ లాటరీ సిస్టమ్ ద్వారా పొందవచ్చునని తెలిపింది. 


మొటావిఫ్ పోర్టల్ ద్వారా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే దరఖాస్తులను ప్రాసెస్ చేసే బాధ్యతను ట్రావ్‌ఈజీ (Traveazy) అనే కంపెనీకి సౌదీ అరేబియా ప్రభుత్వం అప్పగించింది. దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఈ ట్రావ్‌ఈజీ కంపెనీకి మిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేస్తున్న ప్రశాంత్ ప్రకాష్‌ (Prashant Prakash)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌తోనూ సత్సంబంధాలు ఉన్నట్లు మిడిల్ ఈస్ట్ మీడియా చెప్తోంది. 


వెంచర్ కేపిటల్ ఫర్మ్ యాక్సెల్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్, భాగస్వామిగా ప్రశాంత్ ప్రకాశ్ వ్యవహరిస్తున్నారు. ఆయన 2020 నుంచి భారత దేశంలోని నేషనల్ స్టార్టప్ అడ్వయిజరీ కౌన్సిల్‌లో సేవలందిస్తున్నారు. 2021లో బసవరాజ్ బొమ్మయ్‌కి పాలసీ, స్ట్రాటజీ అడ్వయిజర్‌గా ఉన్నారు. ప్రశాంత్ 2020లో మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో టెక్నాలజీని మోదీ చాలా బాగా ఉపయోగించారని ప్రశంసించారు. టెక్నాలజీ స్టార్టప్స్ పట్ల మోదీ ప్రగతిశీల విధానాలను అనుసరిస్తున్నారని, చెక్కుచెదరని అంకితభావం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. 


2016లో ట్రావ్‌ఈజీలోకి 7 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడానికి ప్రశాంత్ ప్రకాష్ కారణమని యాక్సెల్ వెల్లడించింది. ఆ తర్వాత హాలిడేమీ సబ్సిడరీని, 2018లో ఉమ్రాహ్మే కంపెనీని ఏర్పాటు చేశారు. ఉమ్రాహ్మేని మహమ్మద్ ఎంఎస్ బిన్ మహ్‌ఫౌజ్ నడుపుతున్నారు. 2018లో ఐదుగురు భాగస్వాములతో ఏర్పడిన కన్సార్షియంలో యాక్సెల్ భాగస్వామి అయింది. వీరంతా కలిసి ట్రావ్‌ఈజీలో 16 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. దీనికి సహ వ్యవస్థాపకులు భారత జాతీయులు గీత్ భల్లా, దిగ్విజయ్ ప్రతాప్. 


దిగ్భ్రాంతికరం, ప్రమాదకరం

బీజేపీతో అనుబంధం ఉన్న వ్యక్తి ప్రమేయంగల కంపెనీకి హజ్ దరఖాస్తుల ప్రాసెసింగ్ బాధ్యతలను అప్పగించడం పట్ల భారత దేశంలోని ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం కార్యకర్త నబియా ఖాన్ మాట్లాడుతూ, బీజేపీతో అనుబంధంగల పెట్టుబడిదారు ఉన్న కంపెనీకి హజ్ యాత్ర దరఖాస్తుల ప్రాసెసింగ్ బాధ్యతలను అప్పగిస్తూ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతికరం, ప్రమాదకరం అని తెలిపారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందన్నారు. హిజాబ్ ధారణపై ఆంక్షలు విధిస్తోందన్నారు. మొటావిఫ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసిన ముస్లింల వ్యక్తిగత సమాచారం తప్పుడు చేతుల్లోకి వెళ్తుందన్నారు. ముస్లిం దేశాలు ఇటువంటి సున్నిత సమాచారాన్ని, డబ్బును భారత దేశంలో ముస్లింల అణచివేతను ప్రోత్సహించేవారికి అప్పగించడం దురదృష్టకరమని తెలిపారు. 


హైదరాబాద్‌కు చెందిన యాక్టివిస్ట్ సయ్యద్ అబ్దహు కషఫ్ మాట్లాడుతూ, ముస్లింలకు అత్యంత పవిత్రమైన ప్రదేశంలో స్థానం పొందే హక్కు లేనివారిని సౌదీ అరేబియా ఆహ్వానించిందన్నారు. 


Updated Date - 2022-06-18T01:12:12+05:30 IST