ఏజెంట్లను గుడ్డిగా నమ్మకండి: ఇండియన్ మిషన్

ABN , First Publish Date - 2021-01-15T22:57:16+05:30 IST

యూఏఈకి వెళ్లి, ఉద్యోగాలు చేయాలని భావిస్తున్న భారతీయులకు అక్కడి ఇండియన్ మిషన్ కీలక సూచన

ఏజెంట్లను గుడ్డిగా నమ్మకండి: ఇండియన్ మిషన్

దుబాయి: యూఏఈకి వెళ్లి, ఉద్యోగాలు చేయాలని భావిస్తున్న భారతీయులకు అక్కడి ఇండియన్ మిషన్ కీలక సూచనలు చేసింది. ఏజెంట్లను గుడ్డిగా నమ్మి మోస పోవద్దని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన సుమారు 12 మంది మహిళలు.. ఏజెంట్ల మాటలు నమ్మి గత నెలలో యూఏఈకి చేరుకున్నారు. తీరా వాళ్లు అక్కడు వెళ్లిన తర్వాత ఏజెంట్లు తమను మోసం చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో విదేశాంగశాఖ స్పందించి వారు తిరిగి ఇండియాకు రావడానికి ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ‘ఉద్యోగాలు, ఉపాధి పేరుతో భారత పౌరులను విదేశాలకు తీసుకెళ్తున్న కొందరు ఏజెంట్లు వారిని అక్కడ ప్రమాదంలో పడేస్తున్నారు.



 ఏజెంట్లు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని’ భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఈ క్రమంలో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి.. స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏజెంట్ల మాటలను గుడ్డిగా నమ్మి మోస పోవద్దని హెచ్చరించారు. ఆశావహులు దేశాన్ని వీడే ముందు.. ఉద్యోగానికి సంబంధించిన సరైన పత్రాలను చూపించాల్సిందిగా ఏజెంట్లను కోరాలని సూచించారు. కాగా.. కొవిడ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో ఈ తరహా మోసాలు తగ్గుముఖం పట్టాయని.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన తర్వాత ఇటువంటి కేసులు మళ్లీ పెరుతుతున్నట్టు ఇండియన్ ఎంబసీ కార్యాలయ ప్రతినిధి సందీప్ కౌశిక్ అన్నారు. 


Updated Date - 2021-01-15T22:57:16+05:30 IST