ఇజ్రాయెల్‌లో భారతీయులకు అండగా నిలుస్తున్న ఇండియన్ ఎంబసీ

ABN , First Publish Date - 2020-08-05T00:25:38+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు.

ఇజ్రాయెల్‌లో భారతీయులకు అండగా నిలుస్తున్న ఇండియన్ ఎంబసీ

జెరూసలేం: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు కరోనా కారణంగా బయటకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క భారత్‌కు వెళ్లాలన్నా.. ఇతరత్రా సేవల గురించి తెలుసుకోవాలన్నా ఇండియన్ ఎంబసీ ఆఫీసు వరకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో నేరుగా భారతీయుల ఇళ్లకే వెళ్లి కాన్సులర్, ఇతర సేవలను అందించేందుకు ఇండియన్ ఎంబసీ నడుం బిగించింది. గత రెండు వారాలుగా ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలకు ఇండియన్ ఎంబసీ సిబ్బంది వెళ్తోంది. భారతదేశానికి, భారత సంతతికి చెందిన వారిని కలుసుకుని వారికి డాక్యుమెంట్స్‌ సమస్యలు, ఇతరత్రా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


తనకు ఇండియన్ ఎంబసీ సిబ్బంది ఫోన్ చేసి ఇంటి ముందే ఉన్నాం.. పాస్‌పోర్ట్ కలెక్ట్ చేసుకోమంటూ చెప్పినట్టు ఓ భారతీయుడు చెబుతున్నాడు. ఎంతో కాలం నుంచి తాను పాస్‌పోర్ట్‌కు సంబంధించి ఇబ్బందులు పడుతున్నానని, తాను కనీసం బయటకు కూడా వెళ్లకుండానే తన సమస్య తీరుతుందని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇంటికొచ్చి మరీ పాస్‌పోర్ట్ అందించిన ఎంబసీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. అదే విధంగా స్వదేశానికి వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు ఈ నూతన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోంది. భారతీయుల సమస్యలను తీర్చడమే కాకుండా వారి వద్దకు వెళ్లినప్పుడు ఇండియన్ ఎంబసీ సిబ్బంది వారికి ఫేస్‌మాస్క్‌లు, గ్లౌజులను కూడా అందిస్తోంది. కరోనా మహమ్మారి తమను ఆపలేదని.. ప్రతి ఒక్క భారతీయుడికి కాన్సులర్ సేవలను అందిస్తామంటూ ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ నెల ఏడో తేదీన ఈలత్ ప్రాంతానికి, 14వ తేదీన హైఫా ప్రాంతానికి వెళ్లనున్నట్టు తెలిపింది. కాగా.. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 74,430 కరోనా కేసులు నమోదుకాగా.. 546 మంది కరోనా కారణంగా మరణించారు.

Updated Date - 2020-08-05T00:25:38+05:30 IST