మన ఆటకు మహా వైభోగం

ABN , First Publish Date - 2021-08-06T09:56:14+05:30 IST

యావత్తు ప్రజానీకం కోరుకున్న విజయం ఎట్టకేలకు లభించింది. నరాలు తెగే ఉత్కంఠను అధిగమిస్తూ.. గత వైభవాన్ని తిరిగి అందుకోవాలనే కసితో చెలరేగిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్యంతో మురిపించింది...

మన ఆటకు మహా వైభోగం

  • 41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్‌కు ఒలింపిక్‌ పతకం
  • కాంస్య పోరులో జర్మనీపై ఉత్కంఠ విజయం 

ఎన్నో సంవత్సరాలు.. మరెన్నో దశాబ్దాలుగా ఓ మధుర ఘట్టానికై ఎదురుచూస్తూనే ఉన్నాం.. ఒలింపిక్‌ మైదానంలో మనోళ్లు అడుగుపెడితే ప్రత్యర్థి రెండు, మూడు స్థానాల కోసమే పోటీపడిన ‘అష్ట’ సువర్ణ వైభవమిది.. ఎన్ని క్రీడాంశాల్లో మనోళ్లు బరిలోకి దిగినా  స్వర్ణ కాంతులు విరజిల్లేలా చేసిన ఒకే ఒక్క క్రీడ అది. భారత జాతీయ క్రీడగా శోభిల్లిన హాకీ గురించే ఇదంతా. 1980 మాస్కో గేమ్స్‌ తర్వాత చెప్పుకోవడానికేమీ లేకుండా.. అయ్యో అనుకునే స్థాయికి దిగజారిపోయిన ఈ క్రీడ.. ఇదిగో ఇన్నాళ్లకు నూటా ముప్పై కోట్లకు పైగా హృదయాలను ఉప్పొంగేలా చేసింది. సెమీ్‌సలో ఓడినా బాధపడేందుకు సమయం లేదన్న హాకీ వీరులు.. దేశానికి 41 ఏళ్ల తర్వాత మన్‌‘ప్రీతి’కరమైన పతక రుచి చూపించారు.


ఓ దశలో 1-3తో వెనుకబడినా 5-4 స్కోరుతో పుంజుకుంటూ జట్టు విజయాన్ని కళ్లముందుంచింది. కానీ చివరి ఆరు సెకన్లలో ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్‌ లభించిన వేళ.. ఒక్కసారిగా ఉత్కంఠ.. ఏం జరగనుందనే ఆత్రంతో కోట్లాది మంది ఊపిరి బిగపట్టి మరీ టీవీలకు అతుక్కుపోయారు. ఇన్నేళ్ల కల కలగానే మిగిలిపోనుందా అనే వేదన అందరిలోనూ కనిపించింది. కానీ కీపర్‌ శ్రీజేష్‌ గోడలా నిలబడడంతో మైదానంలో ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక్కడ మనకు దక్కింది కాంస్యమే కావచ్చు.. కానీ అది భారత హాకీ పునర్‌వైభవాన్ని చాటేందుకు పడిన తొలి అడుగుగా భావించాలి. అటు ఈ మహోజ్వల విజయంతో దేశంలోని యువత క్రికెట్‌ బ్యాట్‌నే కాకుండా హాకీ స్టిక్‌ను కూడా చేతపడితే అంతకు మించి కావాల్సిందేముంటుంది.


టోక్యో: యావత్తు ప్రజానీకం కోరుకున్న విజయం ఎట్టకేలకు లభించింది. నరాలు తెగే ఉత్కంఠను అధిగమిస్తూ.. గత వైభవాన్ని తిరిగి అందుకోవాలనే కసితో చెలరేగిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్యంతో మురిపించింది. ఈసారి టోక్యో గేమ్స్‌లో ఆరంభం నుంచే అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం ప్రపంచ ఐదో ర్యాంకర్‌ జర్మనీని కాంస్య పోరులో 5-4తో ఓడించింది. భారత్‌ నుంచి సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (17, 34వ నిమిషాల్లో), హార్దిక్‌ సింగ్‌ (27), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (29), రూపిందర్‌పాల్‌ సింగ్‌ (31) గోల్స్‌ సాధించారు. స్టార్‌ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ప్రత్యర్థి ఐదు పెనాల్టీ కార్నర్లలో నాలుగింటిని అడ్డుకుని విజయంలో భాగమయ్యాడు. ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటికే 8 స్వర్ణాలు, ఓ రజతం సాధించగా.. ఇది మూడో కాంస్యం.


ఆరంభంలో వెనక్కి తగ్గినా..: 41 ఏళ్లుగా భారత జట్టుకు ఒలింపిక్‌ పతక పోరులో ఆడిన అనుభవమే లేదు. దీంతో జట్టుపై ఒత్తిడి ఉండడం సహజమే. అటు చూస్తే జర్మనీ చివరి ఒలింపిక్స్‌ (2016)లో కాంస్యం అందుకుంది. దీంతో తొలి క్వార్టర్‌లో మన్‌ప్రీత్‌ సేన తడబాటు కారణంగా జర్మనీకి రెండో నిమిషంలోనే గోల్‌ లభించింది. ఐదో నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ (పీసీ) వృథా అయ్యింది. ఈ దశలో జర్మనీ పీసీని కీపర్‌ శ్రీజేష్‌ అడ్డుకున్నాడు. అలాగే భారత రక్షణ శ్రేణిపై ఒత్తిడి పెంచడంతో జర్మనీ నాలుగు పీసీలు సాధించినా భారత డిఫెండర్లు మాత్రం లొంగలేదు.


హోరాహోరీ: రెండో క్వార్టర్‌లో మాత్రం ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. 17వ నిమిషంలో భారత్‌ తరఫున సిమ్రన్‌జిత్‌ బ్యాక్‌హాండ్‌ షాట్‌తో ఫీల్డ్‌ గోల్‌ చేశాడు. ఈ దశలో భారత డిఫెన్స్‌ తప్పిదాలతో నిమిషం వ్యవధిలోనే జర్మనీ రెండు గోల్స్‌తో 3-1తో ఆధిక్యం సాధించింది. కానీ భారత్‌ పోరాటం ఆపలేదు. ఈ దశలో లభించిన రెండు పీసీలను సద్వినియోగం చేసుకుంది. 27వ నిమిషంలో మొదట హార్దిక్‌ సింగ్‌ అద్భుత రీబౌండ్‌ గోల్‌తో జట్టు తిరిగి పోటీలోకి రాగా.. రెండు నిమిషాల వ్యవధిలో మరో పీసీని హర్మన్‌ప్రీత్‌ నేరుగా పోస్టులోకి పంపడంతో స్కోరు 3-3తో సమమైంది. 


పెనాల్టీ స్ర్టోక్‌తో ఆధిక్యం: మూడో క్వార్టర్‌లో జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. దీనికి తగ్గట్టుగానే భారత సర్కిల్‌లో మన్‌దీ్‌ప సింగ్‌ను మొరటుగా అడ్డుకోవడంతో జట్టుకు పెనాల్టీ స్ట్రోక్‌ లభించింది. దీన్ని 31వ నిమిషంలో రూపిందర్‌పాల్‌ సింగ్‌ గోల్‌ చేయడంతో జట్టు తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. మరో మూడు నిమిషాలకే సిమ్రన్‌జిత్‌ గోల్‌తో భారత్‌ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.                                                           


ఆ ఆరు సెకన్లలో: 48వ నిమిషంలో జర్మనీ చేసిన గోల్‌తో భారత్‌ ఆధిక్యం 5-4కి తగ్గడంతో ఉత్కంఠ పెరిగింది. ఆ తర్వాత రెండు జట్లకు పీసీలు లభించినా వృథా అయ్యాయి. దీనికి తోడు ఆరు సెకన్లలో ఇక మ్యాచ్‌ ముగుస్తుందనగా జర్మనీకి పెనాల్టీ కార్నర్‌ దక్కడంతో ఒక్కసారిగా షాక్‌ తగిలినట్టయింది. కానీ అదృష్టవశాత్తు జర్మనీ ప్లేయర్‌ కొట్టిన షాట్‌ కాస్త ఎత్తుగా రావడంతో ఇబ్బంది లేకుండా కీపర్‌ శ్రీజేష్‌ గ్లోవ్స్‌తో అడ్డుకుని జట్టును సంబరాల్లో ముంచాడు. 


కొవిడ్‌ యోధులకు అంకితం

చివరి 15 నెలలు కఠినంగా గడిచాయి. మేం బెంగళూరు శిబిరంలో ఉన్నప్పుడు మాలో కొందరికి కొవిడ్‌ సోకింది. భారత్‌లో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, మొదటి వరుసలోని యోధులకు ఈ పతకం అంకితం                                    -   మన్‌ప్రీత్‌ సింగ్‌




41 ఏళ్ల తర్వాత ఒలింపిక్‌ పతకం సాధించిన హాకీ జట్టుకు అభినందనలు. అసమాన పోరాట నైపుణ్యాలు ప్రదర్శించారు. ఈ చరిత్రాత్మక విజయం భారత హాకీలో నవశకానికి నాంది పలుకుతుంది. రవి.. నిజమైన చాంపియన్‌లా పోరాడావ్‌.

- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఈరోజు ప్రతి భారతీయుని మదిలో ఉండిపోతుంది. ఇంటికి కాంస్యం తీసుకొస్తున్న హాకీ జట్టుకు అభినందనలు. ఈ ఘనతతో యావత్‌ భారతావని, ముఖ్యంగా యువత కలలు నిజం చేశారు. రజతం సాధించిన రవికుమార్‌ అద్భుత రెజ్లర్‌. అతని పోరాట స్ఫూర్తి అమోఘం.   - ప్రధాని నరేంద్ర మోదీ

అద్భుతం. మీ విజయం ఈ తరం క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.    - ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌


ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత హాకీ జట్టు, రవి దహియా, లవ్లీనాకు అభినందనలు. మున్ముందు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నా - సీఎం కేసీఆర్‌ 

Updated Date - 2021-08-06T09:56:14+05:30 IST