కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో ఓ భారత వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్వదేశంలో ఉన్న భార్యతో ఫోన్ మాట్లాడుతూ, పక్కనే ఉన్న యజమాని గన్‌తో తనను తాను కాల్చుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భారతీయుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లోని అర్దియాలో ఓ వ్యక్తి వద్ద 31 ఏళ్ల భారతీయుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆయనకు స్వదేశంలో ఉన్న భార్య నుంచి ఫోన్ వచ్చింది.
చాలా సేపటివరకు భార్యతో మాట్లాడిన అతను ఉన్నట్టుండి ఆమెపై గట్టిగా అరవడం మొదలెట్టాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న యజమాని తుపాకీ తీసుకుని ఛాతీకి కుడివైపున కాల్చుకున్నాడు. దాంతో తీవ్రంగా గాయపడిన భారత వ్యక్తిని యజమాని ఫార్వానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్న భారతీయుడు కోలుకుంటున్నట్లు యజమాని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన భారతీయుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.