సింగపూర్‌లో భారతీయుడికి పదేళ్ల జైలు !

ABN , First Publish Date - 2020-09-19T21:43:15+05:30 IST

భార్యను హత్యచేసిన కేసులో శుక్రవారం సింగపూర్ కోర్టు భారత వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సింగపూర్‌లో భారతీయుడికి పదేళ్ల జైలు !

సింగపూర్ సిటీ: భార్యను హత్యచేసిన కేసులో శుక్రవారం సింగపూర్ కోర్టు భారత వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తన భార్య వేరే వాళ్లతో అక్రమసంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు కోర్టు విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే... సింగపూర్‌లో ఓ కంపెనీలో బస్ డ్రైవర్‌గా పని చేసే క్రిష్ణన్...  రైతేనా వైతేనా సామి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. 28 ఏళ్లు సాఫీగా సాగిన వీరి దాంపత్యం... కొన్నేళ్ల తర్వాత భార్యపై క్రిష్ణన్ పెంచుకున్న అనుమానంతో చివరకు విషాదాంతానికి దారితీసింది.


రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో 2016లో భార్యపై అనుమానంతోనే క్రిష్ణన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. వారు నివాసముండే లొయంగ్ గార్డెన్స్‌లోని ఇంట్లో భార్యను అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి తన సోదరుడు ఉండే మలేషియాలోని జోహోర్ బహ్రూకు పారిపోయాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు భర్త క్రిష్ణన్ ఈ దారుణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఏడాది జూలైలో సింగపూర్ న్యాయస్థానం క్రిష్ణన్‌ను దోషిగా తేల్చింది. కేవలం భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే ఆమెను హత్య చేసినట్టు కోర్టు విచారణలో క్రిష్ణన్ అంగీకరించాడు. దీంతో హత్య నేరం కింద అతనికి శుక్రవారం న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది.   

Updated Date - 2020-09-19T21:43:15+05:30 IST