అన్నం పెట్టిన ఇంటికే కన్నం.. దుబాయిలో భారత యువకుడి నిర్వాకం..

ABN , First Publish Date - 2020-02-21T20:37:12+05:30 IST

దుబాయిలో ఓ భారత యువకుడు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసి కటకటాల పాలయ్యాడు. తాను పనిచేసే నగల షాపులోనే చోరీలకు పాల్పడ్డాడు.

అన్నం పెట్టిన ఇంటికే కన్నం.. దుబాయిలో భారత యువకుడి నిర్వాకం..

దుబాయి: దుబాయిలో ఓ భారత యువకుడు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసి కటకటాల పాలయ్యాడు. తాను పనిచేసే నగల షాపులోనే చోరీలకు పాల్పడ్డాడు. ఏకంగా రూ. 14 కోట్లకు పైగా విలువ చేసే 86 ఖరీదైన వాచీలు దొంగిలించాడు. విలువైన చేతి గడియారాలు, బంగారు నగలు విక్రయించే దుకాణంలో క్లీనర్‌గా పని చేసే యువకుడు సులువుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో ఇలా చోరీల బాట పట్టాడు. తాజాగా ఈ కేసు దుబాయి కోర్టులో విచారణకు వచ్చింది. న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం... ఇరాక్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు దుబాయిలో నగల షాపు ఉంది. ఈ షాపులో నగలతో పాటు ఖరీదైన వాచీలను కూడా విక్రయిస్తుంటారు. ఇదే షాపులో ఇండియాకు చెందిన 26 ఏళ్ల యువకుడు క్లీనర్‌గా పని చేస్తున్నాడు. యజమానికి చాలా నమ్మకంగా ఉండేవాడు. 


ఈ క్రమంలో యువకుడికి తనపై యజమానికి ఉన్న నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని సులువుగా డబ్బు సంపాదించాలనే దురాలోచన వచ్చింది. దీనికోసం అతని ముందు ఉన్న ఎకైక మార్గం షాపులో దొంగతనం చేయడం. అనుకున్నదే తడువుగా దుకాణంలో చోరీలు చేయడం మొదలెట్టాడు. మొదట షాపులోని విలువైన చేతి గడియారాలను దొంగలించి చెత్త బుట్టలో వేసే వాడు. అనంతరం ఆ చెత్తను బయటవేసే నెపంతో దాంట్లోని వాచీలను తీసుకునేవాడు. ఇలా ఏకంగా అతగాడు 86 ఖరీదైన వాచీలను దొంగలించాడు. వాటి విలువ సుమారు రూ. 14కోట్లకుపై మాటే. అయితే, గతేడాది డిసెంబర్ 25న షాపులో సెల్స్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి చెత్త బుట్టలో 30వేల దిర్హామ్స్(రూ. 58.84లక్షలు) విలువ చేసే ఒక వాచీ దొరకడం యజమాని కంట పడింది. ఏదో పొరపాటున పడిపోయి ఉండొచ్చని యజమాని లైట్ తీసుకున్నాడు. కానీ ఈ ఘటన తర్వాత అతని మనసులో అనుమానం మొదలైంది. దీంతో సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించాడు. 


అందులోని దృశ్యాలు యజమానికి షాకిచ్చాయి. షాపులో క్లీనర్‌గా పనిచేస్తున్న భారత యువకుడు ఇలా వాచీలను చెత్తలో వేయడం చూసి కంగుతిన్నాడు. దాంతో వెంటనే సదురు యువకుడిని యజమాని ఈ విషయమై ప్రశ్నించాడు. మొదట తాను ఈ పని చేయలేదని బుకాయించిన యువకుడు.. సీసీటీవీ కెమెరా దృశ్యాలను చూపించడంతో అతనికి నోటమాట రాలేదు. వెంటనే అదే షాపులో మేనేజర్‌గా పని చేస్తున్న అతని సోదరుడికి యజమాని ఈ విషయం చెప్పాడు. అతను ఇండియాలో ఉండడంతో దుబాయికి రప్పించాడు. అతని సమక్షంలోనే మరోసారి విచారించారు. దాంతో తాను దొంగతనం చేశానని యువకుడు అంగీకరించాడు. చివరగా తాను 2లక్షల 50వేల దిర్హామ్స్(రూ. 49,03,524), 2లక్షల 70వేల దిర్హామ్స్ (రూ. 52,95,805) విలువ చేసే రెండు వాచీలను దొంగిలించినట్లు తెలిపాడు. అనంతరం వాటిని పాకిస్థాన్ వ్యక్తికి 20వేల  దిర్హామ్స్(రూ.3,92,281)కు విక్రయించినట్లు అంగీకరించాడు. దీంతో యువకుడితో పాటు ఆ ఇద్దరు పాకిస్తానీలపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు నైఫ్ పోలీసులు ఈ ముగ్గురిపై జనవరి 6న దొంగతనం కేసు నమోదు చేసి తాజాగా దుబాయిలో కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు దుబాయి కోర్టులో విచారణ దశలో ఉంది. 


Updated Date - 2020-02-21T20:37:12+05:30 IST