హైదరాబాద్‌ కేంద్రంగా వీసాల పేరిట మోసాలు

ABN , First Publish Date - 2021-06-05T17:19:30+05:30 IST

అమెరికాలో వెలుగు చూసిన హెచ్‌-1బీ వీసా కుంభకోణంతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న క్లౌడ్‌ జెన్‌ అనే ఐటీ కెంపెనీ బెంచ్‌ అండ్‌ స్విచ్‌ తరహాలో ఈ మోసానికి పాల్పడినట్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌ కేంద్రంగా వీసాల పేరిట మోసాలు

హెచ్‌ - 1 బీ.. కేర్‌ ఫుల్‌

వీసాల పేరిట కొనసాగుతున్న మోసాలు

గతంలో ఎన్నో ఘటనలు, ఎందరో బాధితులు

క్లౌడ్‌ జెన్‌ కంపెనీ ఉదంతంతో అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్‌ సిటీ:  అమెరికాలో వెలుగు చూసిన హెచ్‌-1బీ వీసా కుంభకోణంతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న క్లౌడ్‌ జెన్‌ అనే ఐటీ కెంపెనీ బెంచ్‌ అండ్‌ స్విచ్‌ తరహాలో ఈ మోసానికి పాల్పడినట్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. క్లౌడ్‌జెన్‌ కంపెనీకి ప్రపంచంలోని పలు దేశాలతో పాటు యూఎస్‌లోని హౌస్టన్‌లోనూ బ్రాంచ్‌ ఉంది. భారతదేశానికి చెందిన ఎంతో మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులను హెచ్‌-1బీ వీసా పేరిట మోసం చేసినట్లు ఆ కంపెనీ అమెరికా టెక్సా్‌సలోని హోస్టన్‌ కోర్టులో నేరాన్ని ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2013 మార్చి నుంచి 2020 డిసెంబర్‌ వరకు ఈ వీసా కుంభకోణం దందా కొనసాగింది. 


ఈ కాలంలో 4.94 లక్షల డాలర్లు ఫీజులు, వేతనాల్లో పర్సంటేజీలు, కమీషన్ల రూపంలో కంపెనీ చేజిక్కించుకుంది. నకిలీ పత్రాలు, కాంట్రాక్టులు సృష్టించి వీసాలు పొందడంలో ఈ కంపెనీ ఆరితేరింది. యూఎ్‌సలోనూ తమ వద్ద హెచ్‌-1బీ వీసా కల్గిన అభ్యర్థులు ఉన్నారంటూ అక్కడి కంపెనీలను సైతం బురిడీ కొట్టించింది. అక్కడి లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లో డాక్యుమెంట్లను సమర్పించి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని  స్థానిక కంపెనీలను తప్పుదోవ పట్టించింది. ఆ కంపెనీని నమ్మి ఎనిమిది ఏళ్లలో అక్కడికి చేరిన టెకీల పరిస్థితి ఇప్పుడు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. బోగస్‌ పత్రాలు, కాంట్రాక్టులతో వెళ్లిన వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 


గతంలోనూ ఘటనలు

- నిజామాబాద్‌కు చెందిన నరేందర్‌ గిట్టా ఎంబీఏ పట్టభద్రుడు. హెచ్‌-1బీ వీసా పేరిట మోసాలకు పాల్పడ్డాడు. 2018లో ఆరో టు స్కై డాట్‌ కామ్‌ పేరిట కన్సల్టెన్సీని ప్రారంభించి హెచ్‌-1బీ వీసా ఇప్పిస్తానని ప్రకటించాడు. అతడిని నమ్మి చాలా మంది డబ్బులు ముట్టచెప్పారు. తర్వాత మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. 2020 ఆగస్టులో నిజామాబాద్‌లో తల దాచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.


- 2016లో యాదంరెడ్డి గోపీ యూఎ్‌సలో హెచ్‌-1బీ వీసాలు ఇప్పిస్తానని అమీర్‌పేట వేదికగా ప్రచారం చేశాడు. అతని మాటలు నమ్మిన అమాయకులు ప్రాసెసింగ్‌ ఫీజు పేరిట రూ. 2లక్షలు చెల్లించారు. వీసాలు మాత్రం రాలేదు. డబ్బులు తీసుకుని దాటవేయసాగాడు. 2017 ఏప్రిల్‌ నెలలో ఖైరతాబాద్‌కు చెందిన వినోద్‌ సైబర్‌క్రైమ్‌లో దీనిపై ఫిర్యాదు చేశాడు. ఫోన్‌ స్విచాఫ్‌ ఉన్నప్పటికీ పోలీసులు నిందితుడు గోపీని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో యూఎ్‌సలో ఉన్న స్నేహితుడు కార్తీక్‌ హామీ ఇవ్వడంతోనే కన్సల్టెన్సీ నిర్వహించానని ఒప్పుకున్నాడు. అతనితో పాటు హరియాణాకు చెందిన రాజేందర్‌ ప్రమేయం ఉందని చెప్పడంతో పోలీసులు అప్పట్లో వారిపై కూడా చర్యలకు సిద్ధమయ్యారు. 


అప్రమత్తంగా ఉండాలి

ఇలాంటి ఘటనలెన్నో వెలుగు చూస్తున్నా విద్యార్థులు ఇంకా ఇలాంటి మోస పూరిత కన్సల్టెన్సీలను నమ్ముతున్నారని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. నేరుగా అమెరికా వీసా కేంద్రాన్ని సందర్శించి అక్కడి నుంచి సాయం తీసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశముందని సూచిస్తున్నారు. క్లౌడ్‌ జెన్‌ సంస్థ బాగోతంపై ఇక్కడి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్న ఆ సంస్థ కార్యాలయాన్ని  మూసివేయడం గమనార్హం.   


Updated Date - 2021-06-05T17:19:30+05:30 IST