Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

భారత సుందరికి విశ్వ కిరీటం

twitter-iconwatsapp-iconfb-icon
భారత సుందరికి విశ్వ కిరీటం

మిస్‌ యూనివర్స్‌ విజేతగా హర్నాజ్‌ కౌర్‌ సంధూ

21 ఏళ్ల తర్వాత.. 21 ఏళ్ల పంజాబీ సుందరి

తిరిగి భారత్‌కు ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టిన వైనం

పోటీలో 79 దేశాల సుందరీమణులు

యువత సమస్యలపై అడిగిన ప్రశ్నకు స్ఫూర్తిదాయక జవాబుతో విజేతగా సంధూ

2, 3వ స్థానాల్లో పరాగ్వే, దక్షిణాఫ్రికా 

భారతీయ సుందరికి విశ్వ కిరీటం

మిస్‌ యూనివర్స్‌ విజేతగా హర్నాజ్‌ కౌర్‌ సంధూ


ఇలాత్‌, డిసెంబరు 13: భారతీయ యువతి హర్నాజ్‌ కౌర్‌ సంధూ ప్రపంచసుందరి కీరిటాన్ని దక్కించుకున్నారు. చివరిసారిగా 2000లో లారా దత్తా మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత సంధూ రూపంలో మూడోసారి భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ ఘనత లభించింది. అయితే, సంధూ వయస్సు కూడా 21 ఏళ్లే కావడం విశేషం. 79 దేశాల సుందరాంగనలను వెనక్కి నెట్టి 2021 సంవత్సరానికిగాను ఈ కీర్తి కిరీటాన్ని పంజాబీ భామ సొంతం చేసుకున్నారు. ఇజ్రాయెల్‌లోని ఇలాత్‌ నగరంలో ఘనంగా జరిగిన 70వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో గత సంవత్సరం విజేత అయిన మెక్సికో సుందరి ఆండ్రియా మేజా నుంచి సంధూ కీరిటాన్ని అందుకున్నారు. పెరూగ్వే సుందరి నదియా పెహేరా (22) రెండోస్ధానంలో, దక్షిణాఫ్రికా సుందరి లలేలా ఎమ్‌స్వానే (24) మూడోస్థానంలో నిలిచారు. తనను విజేతగా ప్రకటించగానే వేదికపై సంధూ భావోద్వేగానికి గురయ్యారు.


‘‘భగవంతుడికి, జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, చక్కని మార్గదర్శకం, మద్దతు అందించిన మిస్‌ ఇండియా సంస్థకు సదా కృతజ్ఞురాలిని’’ అంటూ ప్రతిస్పందించారు. ఆమె వచ్చే ఏడాది కాలంపాటు అమెరికాలోని న్యూయార్క్‌లో గడుపుతారు. లింగ వివక్ష, పేదరికం, నిరక్షరాస్యత తదితర అంశాలపై మిస్‌ యూనివర్స్‌ సంస్థ సహా పలు సంస్థలకు అధికార ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. 


విజేతను చేసిన జవాబు 

ఒత్తిళ్లను అధిగమించడంలో యువతకు ఎలాంటి సలహా ఇస్తారని సంధూను మిస్‌ యూనివర్స్‌ కమిటీ ప్రశ్నించింది. ఆమెకు సంధించిన ప్రశ్నల పరంపరలో ఇదే చివరిది. ‘‘తమపై తమకు నమ్మకం కొరవడటమే యువత ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఒత్తిడి. ఎవరి ప్రత్యేకత వారిదనేది గుర్తించడంలోనే నిజమైన అందం దాగి ఉంటుంది. బయటకు రండి. మీకోసం మీరు గొంతెత్తండి. మీ జీవితానికి మీరే నాయకులు. నాకు నా మీద విశ్వాసం ఉంది. దానివల్లే ఈరోజున ఇలా మీ ఎదుట నిలబడ్డాను’’ అని సంధూ సమాధానమిచ్చారు. కాగా, మిస్‌ యూనివర్స్‌ పోటీలకు తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన ఇజ్రాయెల్‌, రూ. 16 కోట్లు ఖర్చుచేసింది. 


సుందర ప్రస్థానం

హర్నాజ్‌ కౌర్‌ సంధూ పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌లో 2000లో జన్మించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలనా శాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీ చేస్తున్నారు. 2017లో మిస్‌ చండీగఢ్‌, 2018లో మిస్‌ మాక్స్‌ ఎమెర్జింగ్‌ స్టార్‌, 2019లో ఫెమీనా మిస్‌ ఇండియా పంజాబ్‌గా నిలిచారు. 2021 సంవత్సరానికిగాను లీవా మిస్‌ దివా యూనివర్స్‌ కీరిటమూ అందుకున్నారు. కొన్ని పంజాబీ చిత్రాల్లో సంధూ నటించారు. Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.