Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 10 Aug 2022 00:00:00 IST

జీవితమే పోరాటం

twitter-iconwatsapp-iconfb-icon
జీవితమే పోరాటం

 ఆరుట్ల కమలాదేవి

జననం: జూన్‌ 1920 

మరణం: 1.1.2001


తెలంగాణలో ప్రస్తుత యాదాద్రి-భువనగిరి జిల్లా మంతపురిలో పల్ల వెంకటరాంరెడ్డి, లక్ష్మీ నరసమ్మలకు 1920 జూన్‌లో కమలాదేవి జన్మించారు. అసలు పేరు రుక్మిణి. ఆమెకు పన్నెండో ఏట ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహమైంది. భర్త గాంధేయవాది. వరకట్నం తీసుకోలేదు కానీ, పెళ్ళి సమయంలో వధూవరులకు ఖద్దరు వస్త్రాలే ఇవ్వాలనీ, వివాహం తరువాత అమ్మాయిని హైదరాబాద్‌ పంపించి చదివించాలనీ మామగారికి స్పష్టం చేశారు. తన భార్య విద్యావంతురాలై దేశ సేవ చేయాలనేది ఆయన వాంఛ. అందుకే కమలాదేవి అని నామకరణం చేశారు. 


  1932లో చదువుకోసం కమలాదేవి హైదరాబాద్‌ వచ్చారు. ఆంధ్రోద్యమ పితామహుడు మాడపాటి హనుమంతరావు కృషి వల్ల... తెలుగు అమ్మాయిల కోసం హైదరాబాద్‌లో ఒక పాఠశాల ఏర్పాటయింది. కానీ వసతి లేదు. అక్కడ రెడ్డి హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న ఆమె భర్త రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి, మరికొందరు మిత్రులు... బాలికల హాస్టల్‌ ఆవశ్యకతను రాజాబహదూర్‌ వెంకటరామారెడ్డికి వివరించారు. ఆయన చలవతో బాలికలకు హాస్టల్‌ ఏర్పాటయింది. పన్నెండేళ్ళ కమలాదేవి మూడో తరగతిలో చేరి, ఆ హాస్టల్‌కు ప్రారంభోత్సవం చేశారు. మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. చదువుకొనే సమయంలోనే ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాలంటీర్‌ దళాలకు నాయకత్వం వహించారు.


అనంతరం అత్తవారి గ్రామమైన కొలను పాకకు చేరుకుని.. ఆడపిల్లల కోసం పాఠశాలను, గ్రంథాలయాన్నీ ఏర్పాటు చేశారు. గ్రంథాలయంలో రాజకీయాలనూ, నిజాం పాలన దౌర్జన్యాలనూ చర్చించుకోవటంతో ప్రభుత్వం, జాగీర్దారులూ... బడినీ, గ్రంథాలయాన్నీ స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల అండతో వాటిని కాపాడింది కమలాదేవి.


 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. కాంగ్రెస్‌ బాట నుంచి వామపక్ష మార్గానికి మళ్ళిన కమలాదేవి... విజయవాడ వచ్చి, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకున్నారు. నిరుపేదలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న జాగీర్దార్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా సాగిన వెట్టి చాకిరీ రద్దు ఉద్యమంలో పని చేశారు. పెత్తందారుల నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ఆంధ్ర మహాసభ చేసిన ఆందోళనల్లో పాల్గొన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా... హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర రాజ్యమని నిజాం పాలకులు ప్రకటించారు. భారత్‌లో అంతర్భాగం అవ్వాలన్న వాంఛతో ప్రజలు తిరుగుబాటు చేస్తారనే ఆలోచనతో... రజాకర్లనూ, రిజర్వు పోలీసులనూ గ్రామాల మీదకి ఉసిగొలిపి మారణహోమం సృష్టించారు. ఈ దుశ్చర్యలను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టుల నాయకత్వాన ఏర్పడిన సాయుధ గెరిల్లా దళంలో కమలాదేవి చేరారు. జాగీర్దారులు, భూస్వాములు, ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూములనూ, వ్యవసాయ యోగ్యమైన అటవీ భూములనూ ఈ గెరిల్లా దళాలు హస్తగతం చేసుకొని, పేద రైతులకూ, నిరాధారులైన ప్రజానీకానికీ పంచిపెట్టేవారు. భూస్వామ్య దోపిడీకాండకు వ్యతిరేకంగా సాగిన ఈ చారిత్రక పోరాటంలో కమలాదేవి అత్యంత ప్రధాన పాత్ర వహించారు. 


1948లో... స్వతంత్ర భారతంలో నైజాం రాష్ట్రం విలీనం అయిన తరువాత... అప్పటి వరకూ అడవిలో ఉంటూ  ప్రాణాలకు తెగించి ముష్కరులతో పోరాడిన వారందరూ ఆయుధాలు విసర్జించి, నగర ప్రవేశం చేయాలని భారత ప్రభుత్వం కోరింది. అయితే తమ ఉద్యమాన్ని మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుందనే భావనతో కొందరు ఉద్యమకారులు వెనక్కి రాలేదు. వారిలో కమలాదేవి ఒకరు. ఆమె 1949 జనవరిలో... బహదూర్‌ పేట శివార్లలో అరెస్టయ్యారు. వివిధ కారాగారాల్లో రెండున్నర ఏళ్ళు జైలు శిక్షను అనుభవించిన ఆమె అక్కడి మహిళ దుస్థితిపై నిరసన దీక్ష చేపట్టారు. దాంతో ఆమెను ఔరంగాబాద్‌ జైలుకు పంపించారు. ఆమెపై మోపిన ఆరోపణలకు సాక్ష్యాలు లేకపోవడంతో... కేసులన్నీ కొట్టేశారు. కానీ  విడుదల చేయలేదు. చివరకు హైదరాబాద్‌ కోర్టులో కమలాదేవి పిటిషన్‌ దాఖలు చేయడంతో, 1951లో విడుదల చేశారు. అనంతరం 1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. పదిహేనేళ్ళపాటు అదే స్థానం నుంచి కమ్యూనిస్ట్‌ పార్టీ తరఫున శాసనసభ్యురాలుగా ఉన్నారు. 1963-64 మధ్య ప్రతిపక్ష కమ్యూనిస్ట్‌ నాయకురాలుగా పని చేశారు. ఈ విధంగా ఆంధ్ర  శాససభలో తొలి మహిళా ప్రతిపక్షనేతగా నిలిచారు. 


భారత స్వాతంత్రోద్యమ యోధురాలుగా, తెలంగాణ సాయుధ పోరాట వీరురాలిగా ఘనకీర్తి సాధించిన నాయకురాలు ఆరుట్ల కమలాదేవి. అంతేకాదు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో తొలి ప్రతిపక్ష నాయకురాలు కూడా. ఆమెది అర్థ శతాబ్దం పై చిలుకు పోరాట చరిత్ర. 

(‘స్వతంత్ర సమరంలో ఆంధ్రమహిళలు’ సంకలనం నుంచి )


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

రెడ్ అలర్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.