నిఘా వర్గాల హెచ్చరికతో పాక్ సరిహద్దుల్లో భారత్ దళాలు అప్రమత్తం

ABN , First Publish Date - 2020-07-11T22:09:56+05:30 IST

నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి జమ్మూ-కశ్మీరు సరిహద్దుల్లో భారతీయ దళాలను

నిఘా వర్గాల హెచ్చరికతో పాక్ సరిహద్దుల్లో భారత్ దళాలు అప్రమత్తం

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి జమ్మూ-కశ్మీరు సరిహద్దుల్లో భారతీయ దళాలను అప్రమత్తం చేశారు. పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఈ చర్య తీసుకున్నారు. 


నిఘా వర్గాల సమాచారం ప్రకారం, భింబర్ గలీ, నౌషేరా సెక్టర్లలో సాయుధులైన ఉగ్రవాదులు బీఏటీ యాక్షన్‌కు పాల్పడే ఉద్దేశంతో భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాలని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), ఇతర భారతీయ దళాలకు సమాచారం అందజేశారు. 


అత్యంత త్వరగా భారత్‌పై దాడులు చేసేవిధంగా ఉగ్రవాదులను పాకిస్థాన్ సైన్యానికి చెందిన బీఏటీ ప్రోత్సహిస్తున్నట్లు భారత సైన్యం అనుమానిస్తోంది. ఉగ్రవాదులు భారత దేశం వైపు వస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.  


బీఎస్ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ, కొద్ది గంటల క్రితమే నిఘా సమాచారం అందిందని చెప్పారు. సరిహద్దుల వెంబడి దళాలను మరింత అప్రమత్తం చేశామన్నారు. ముఖ్యంగా రెండు సెక్టర్లలో దళాలను నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు వివరించారు. రాత్రి వేళల్లో అదనపు సిబ్బందిని మోహరిస్తామని తెలిపారు. పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా దీటుగా బదులిస్తామన్నారు. 


బీఏటీలో పాకిస్థాన్ సైనిక కమాండోలు, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ తదితర ఉగ్రవాద సంస్థల ఉగ్రవాదులు ఉంటారు. సామాన్యులపై కూడా బీఏటీ దాడులు చేస్తుండటం మరింత దారుణం. జనవరిలో పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి సాధారణ పౌరుడు మహమ్మద్ అస్లాంను దారుణంగా హత్య చేశారు. ఆయన తల, మొండెం వేరు చేశారు. 


Updated Date - 2020-07-11T22:09:56+05:30 IST