కువైత్ సిటీ: కువైత్‌లోని మంగాఫ్‌లో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్ కూలిపోవడంతో ఓ భారత ప్రవాసుడు మృతి చెందాడు. శనివారం సాయంత్రం(కువైత్ కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని కేరళకు చెందిన మహమ్మద్ షఫీగా గుర్తించారు. సమీపంలోని బక్కలా గ్రోసరీ స్టోర్‌లో పని చేస్తున్న అతడు డెలివరీ కోసం ఆ భవనానికి వెళ్లాడు. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న షఫీ అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారంతో అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది లిఫ్ట్‌ను తెరిచి షఫీ మృతదేహాన్ని బయటకు తీశారు. షఫీ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి