ట్రంప్‌ రూటే సెపరేటు!

ABN , First Publish Date - 2020-06-23T07:06:43+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ది ఒక విలక్షణ శైలి. దేశీయ సమస్యలకు విదేశీ పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. ఒకవైపు పెరిగిపోతున్న నిరుద్యోగుల సంఖ్య.. మరోవైపు వేగంగా దూసుకొస్తున్న అధ్యక్ష ఎన్నికలు...

ట్రంప్‌ రూటే సెపరేటు!

  • హెచ్‌1 బీ, ఎల్‌1లపై ఆంక్షలకు సిద్ధం
  • నష్టపోనున్న భారతీయ నిపుణులు
  • అమెరికాలో నిరుద్యోగితే కారణం
  • మనకే కాదు.. వారికీ నష్టమే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ది ఒక విలక్షణ శైలి. దేశీయ సమస్యలకు విదేశీ పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. ఒకవైపు పెరిగిపోతున్న నిరుద్యోగుల సంఖ్య.. మరోవైపు వేగంగా దూసుకొస్తున్న అధ్యక్ష ఎన్నికలు.. ఇంకో వైపు కరోనా వల్ల మందగించిన ఆర్థిక వృద్ధి.. వీటన్నింటితోను సతమతమవుతున్న ట్రంప్‌ అమెరికాలోని విదేశీ నిపుణులపై గురిపెట్టారు. ‘హైర్‌ అమెరికన్‌’ నినాదంలో భాగంగా విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్‌1-బీ, ఎల్‌1, ఓపీటీలపై ఆంక్షలు విధించటానికి సిద్ధమయ్యారు.  


ఇప్పుడే ఎందుకు?

వాస్తవానికి 2017 నుంచి ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. వీసాల జారీ నిబంధనలను, పునఃసమీక్ష విధానాన్ని కఠినతరం చేశారు. ఈలోగా.. కొవిడ్‌-19 వ్యాప్తి చెందటం ఆరంభమైంది. అమెరికాలో నిరుద్యోగిత పెరిగిపోయి, నిరుద్యోగుల సంఖ్య 4 కోట్లకు చేరిందని అంచనా. వీరందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వటం పెద్ద సమస్య అయితే.. వీరికి ఉపాధి కల్పించాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపైనే ఉంది. దీంతో ట్రంప్‌ కన్ను విదేశీ నిపుణులపై పడింది. వీరి సంఖ్యను తగ్గించి, ఆ ఉద్యోగాలు అమెరికా పౌరులకు ఇస్తామనేది ట్రంప్‌ సర్కారు వాదన. ఇందులో సాధ్యాసాధ్యాలను పక్కనపెడితే, రాజకీయంగా తనకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ట్రంప్‌ ఈ ఆదేశాల జారీకి సిద్ధపడ్డారని నిపుణులు అంటున్నారు. ట్రంప్‌ గతంలో జారీ చేసిన ఆదేశాలు జూన్‌ 22న ముగిస్తాయి. వీటిని కొనసాగించాలంటే మళ్లీ కొత్త ఆదేశాలు జారీ చేయాలి. అందుకే.. కొత్త ఆదేశాల జారీకి ట్రంప్‌ సిద్ధమయ్యారు.


మనకున్న ప్రమాదమేమిటి?

ఈ సారి ట్రంప్‌ హెచ్‌1-బీ, ఎల్‌1, జే1, ఓపీటీలపై దృష్టిపెట్టారు. జే1ను రిసెర్చ్‌ స్కాలర్స్‌కు, మన దేశం నుంచి ఎక్సేంజ్‌ ప్రోగ్రాముల కింద వెళ్లేవారికి ఇస్తారు. వీరి సంఖ్య తక్కువే. కానీ హెచ్‌1-బీ, ఎల్‌1, ఓపీటీలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఎక్కువే. ఏటా అమెరికా ప్రభుత్వం 85 వేల మంది విదేశీ నిపుణులకు హెచ్‌1-బీ వీసాలను జారీచేస్తుంది. ఎక్కువ కాలంగా అమెరికాలో ఉంటున్నవారు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటారు. గ్రీన్‌కార్డుల మంజూరుపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక అమెరికాలోని కంపెనీలకు సేవలు అందించటానికి మన దేశ నిపుణులకు ఎల్‌1 వీసాలు ఇస్తారు. అమెరికాకు చెందిన క్యాట్‌ఓ ఆర్గ్‌ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో మన దేశానికి చెందిన 4 లక్షల మంది హెచ్‌1-బీ వీసాపై.. లక్ష మంది ఎల్‌1 వీసాలపై అమెరికాలో నివసిస్తున్నారు. హెచ్‌1బీ నిబంధనలను కఠినతరం చేయడంతో.. ఆ వీసాను స్పాన్సర్‌ చేయటానికి కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. బ్రిట్‌బార్ట్‌ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. 2018లో 70 వేల మంది భారతీయ విద్యార్థులు ఓపీటీపై అమెరికాలో ఉన్నారు. ఓపీటీపై కూడా ఆంక్షలు విధిస్తే వీరందరికీ తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ట్రంప్‌ సర్కారు విధించే ఆంక్షల వల్ల భారత్‌తో పాటుగా అమెరికాకు కూడా నష్టం జరుగుతుందంటున్నారు నాస్కాం గ్లోబల్‌ ట్రేడ్‌ విభాగం అధినేత శివేంద్ర సింగ్‌. ‘‘ఒక్క ఐటీ అనే కాకుండా.. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు వైద్యరంగం, ఆన్‌లైన్‌ విద్య, మౌలిక సదుపాయాలు.. ఇలా అన్ని రంగాల్లో నిపుణుల అవసరం ఉంది’’ అని ఆయన అంటున్నారు. ఈ నిర్ణయాల వల్ల అమెరికాలో ఉద్యోగం చేస్తూ.. భారత్‌కు  వచ్చి.. కరోనా వల్ల తిరిగి వెళ్లలేకపోయిన వారికే ఇబ్బంది అని షీలామూర్తి అంటున్నారు.  

-స్పెషల్‌ డెస్క్‌


Updated Date - 2020-06-23T07:06:43+05:30 IST