విహారయాత్రలో విషాదం.. Ras Al Khaimahలో భారతీయ నర్సు మృతి!

ABN , First Publish Date - 2022-05-07T15:40:31+05:30 IST

ఈద్ హాలీడేస్‌ సందర్భంగా సరదాగా ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భారతీయ నర్సును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు కబళించింది.

విహారయాత్రలో విషాదం.. Ras Al Khaimahలో భారతీయ నర్సు మృతి!

దుబాయ్: ఈద్ హాలీడేస్‌ సందర్భంగా సరదాగా ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భారతీయ నర్సును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు కబళించింది. రాస్ అల్ ఖైమాలోని జెబెల్ జైన్స్ మౌంటెన్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 3న జరిగిన ఈ ప్రమాదంలో ఆమె భర్త పిల్లలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన తింటు పాల్(36) అనే భారతీయ నర్సు అల్ హార్మాలోని రాస్‌ అల్‌ఖైమా ఆస్పత్రిలో పనిచేస్తుంది. ఆమెకు భర్త కృప శంకర్, ఇద్దరు పిల్లలు క్రితి శంకర్, ఆదిన్ శంకర్ ఉన్నారు. రంజాన్ హాలీడేస్ రావడంతో ఈ నెల 3వ తేదీన భర్తపిల్లలతో పాటు తన తల్లితో కలిసి తింటు రాస్ అల్ ఖైమాలోని జెబెల్ జైన్స్ మౌంటెన్స్‌‌కు విహారయాత్రకు వెళ్లింది. అయితే, వీరు ప్రయాణిస్తున్న వాహనం అతి వేగం కారణంగా అదుపుతప్పడంతో బోల్తా పడింది. 


ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో సహా ఐదుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రాస్ అల్ ఖైమా పోలీసులు నేషనల్ అంబులెన్స్ టీమ్‌, సివిల్ డిఫెన్స్ బృందంతో కలిసి వెంటనే ప్రమాదస్థలికి చేరుకుంది. గాయపడిన అందరిని అంబులెన్స్‌లో రాస్ అల్ ఖైమాలోని అల్ సఖర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తింటును ఐసీయూలో చికిత్స అందించారు. కానీ, తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు ఆమెను బతికించలేకపోయారు. చికిత్స పొందుతూ ఈ నెల 4న ఆమె చనిపోయింది. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో పాటు తల్లి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తింటు మృతితో వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అటు ఆమె పనిచేసే ఆస్పత్రి సిబ్బంది కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆస్పత్రి యాజమాన్యం ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి తింటు మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. 

Read more