Mahzooz draw: భారత ప్రవాసుడి పంట పండింది..!

ABN , First Publish Date - 2021-12-10T15:29:32+05:30 IST

యూఏఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా తాజాగా దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఓ భారత ప్రవాసుడి పంట పండింది.

Mahzooz draw: భారత ప్రవాసుడి పంట పండింది..!

దుబాయ్: యూఏఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా తాజాగా దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఓ భారత ప్రవాసుడి పంట పండింది. ఈ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన అక్షయ్ ఎరియకడన్ అరవిందన్(22) అనే భారత యువకుడు ఏకంగా ఒక కేజీ బంగారం గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన అక్షయ్ ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అలా వచ్చిన సంపాదనతో స్వదేశంలో తనకు ఉన్న అప్పులు, కుటుంబ అవసరాలను తీరుస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితుల సూచన మేరకు ఇటీవల మహజూజ్ 54వ వీక్లీ డ్రాలో టికెట్ కొనుగోలు చేశారు. తాజాగా దుబాయ్‌లో మహజూజ్ లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో అక్షయ్ విజేతగా నిలిచారు. దీంతో మొదటి బహుమతిగా ఒక కిలో బంగారం గెలుచుకున్నారు.


ఇక ఇంత భారీ ప్రైజ్ గెలిచినందుకు అక్షయ్ ఆనందానికి అవధుల్లేవు. గతేడాది తన తండ్రి క్యాన్సర్‌తో చనిపోయారని, సరిగ్గా తన తండ్రి సంవత్సరికం రోజున మహజూజ్ డ్రా నిర్వహించడం, అందులో తాను కిలో బంగారం గెలుచుకోవడం నిజంగా నమ్మలేకపోతున్నానని అక్షయ్ చెప్పారు. ఇది తన తండ్రి తనకు దీవించి ఇచ్చిన బహుమతిగా ఆయన పేర్కొన్నారు. తన ఫ్యామిలీ అప్పులన్నీ తీర్చేయడమే తన కలగా చెప్పిన ఆయన.. ఈ భారీ ప్రైజ్‌తో అది సాకారం అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో కొంత మొత్తాన్ని వెచ్చించి ఓ ఇల్లు నిర్మించడంతో పాటు తన తల్లికి బంగారు చైన్ కూడా కొనుగోలు చేస్తానని అక్షయ్ తెలిపారు.      


Updated Date - 2021-12-10T15:29:32+05:30 IST