కంబోడియాలో చిక్కుకున్న ప్రవాసుల కోసం రిపాట్రియేషన్ విమానం

ABN , First Publish Date - 2020-10-13T16:48:02+05:30 IST

కంబోడియాలో చిక్కుకున్న భారత ప్రవాసుల కోసం భారత ఎంబసీ మరో రిపాట్రియేషన్ విమానం ఏర్పాటు చేసింది.

కంబోడియాలో చిక్కుకున్న ప్రవాసుల కోసం రిపాట్రియేషన్ విమానం

నమ్ పెన్: కంబోడియాలో చిక్కుకున్న భారత ప్రవాసుల కోసం భారత ఎంబసీ మరో రిపాట్రియేషన్ విమానం ఏర్పాటు చేసింది. సుమారు 149 మంది ప్రవాసులు ఈ విమానం ద్వారా స్వదేశానికి రానున్నారని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అక్టోబర్‌లోనే నమ్ పెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిర గాంధీ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు ఈ ఫ్లైట్ రానుంది. కాగా, వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇది కంబోడియా నుంచి భారతదేశానికి రానున్న మూడో రిపాట్రియేషన్ విమానం. ఇక ఈ విమాన టికెట్ల ధరల విషయానికి వస్తే... ఎకానమీ క్లాస్‌లో పెద్దవారికి 340 డాలర్లు, చిన్నారులకు 255 డాలర్లుగా ఉంటే... బిజినెస్ క్లాస్‌లో పెద్దవాళ్లకు 800 డాలర్లు, పిల్లలకు 80 డాలర్లుగా నిర్ణయించామని ఎంబసీ పేర్కొంది.


ప్రతి ప్రయాణికుడు 30 కిలోల లగేజీ తీసుకెళ్లవచ్చు. అలాగే క్యాబిన్ లగేజీ మాత్రం 7 కిలోలు మాత్రమే. ఒకవేళ ఈ పరిమితులకు మించి లగేజీ తీసుకెళ్తే ప్రతి కిలోకు 20 డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ విమానానికి సంబంధించి ప్రస్తుతం అక్కడి స్థానిక అధికారులతో చర్చలు జరుగుతున్నందున ఇంకా టికెట్ బుకింగ్స్ ప్రారంభించలేదని ఎంబసీ అధికార ప్రతినిధి ఆదర్శ్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ ఫార్మాలిటీలు పూర్తి కాగానే టికెట్ విక్రయాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. టికెట్ బుక్ చేసుకోవాలనుకునే భారత ప్రవాసులు నేరుగా ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని మిశ్రా తెలిపారు.   

Updated Date - 2020-10-13T16:48:02+05:30 IST