భారత ప్రవాసులకు ముఖ్య గమనిక.. కువైత్ సిటీలోని BLS Center వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి!

ABN , First Publish Date - 2022-06-13T14:53:46+05:30 IST

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది. పాస్‌పోర్ట్, వీసా సేవలను అందించే కువైత్ సిటీలోని బీఎల్ఎస్ ఔట్‌సోర్సింగ్ కేంద్రం పనివేళలను మార్చింది.

భారత ప్రవాసులకు ముఖ్య గమనిక.. కువైత్ సిటీలోని BLS Center వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి!

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది. పాస్‌పోర్ట్, వీసా సేవలను అందించే కువైత్ సిటీలోని బీఎల్ఎస్ ఔట్‌సోర్సింగ్ కేంద్రం పనివేళలను మార్చింది. ఉదయం 7.30 నుంచి రాత్రి 9.30 వరకు ఈ సెంటర్ తెరిచే ఉంటుంది. శనివారం నుంచి గురువారం వరకు ఇవే పని గంటలు ఉంటాయి. ఇక శుక్రవారం మాత్రం మాధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఉంటుంది. ఈ మారిన పని వేళలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా ఎంబసీ అధికారులు వెల్లడించారు. 


ఇక కాన్సులర్ అటెస్టేషన్ కోసం BLS సెంటర్‌లో ఏదైనా రోజు ఉదయం 10 గంటల వరకు జమ చేసిన పత్రాలు అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు దరఖాస్తుదారులకు తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ పత్రాలు ఉదయం 10.00 గంటల తర్వాత డిపాజిట్ చేస్తే మరుసటి పనిరోజున సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9.30 వరకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాగా ఎమర్జెన్సీ కేసుల విషయంలో అభ్యర్థుల అత్యవసర పరిస్థితిని బట్టి కేస్-టు-కేస్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.


ఇదిలాఉంటే.. జలీబ్(అబ్బాసియా), ఫహాహీల్‌లోని బీఎల్ఎస్ ఔట్‌సోర్సింగ్ కేంద్రాలను ఎంబసీ తాత్కాలికంగా క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఈ రెండు సెంటర్లు మూసే ఉంటాయని Indian Embassy వెల్లడించింది. కువైత్ సిటీలోని అలీ అల్ సేలం స్ట్రీట్‌లోని జవహార్ టవర్స్‌లో ఉన్న మూడో కేంద్రం పనివేళలను తాజాగా సవరించింది. ఇంతకుముందు ఈ సెంటర్ 24/7 పని చేస్తుందని చెప్పిన ఎంబసీ.. ఇప్పుడు పనిగంటలను మార్చింది. ప్రవాసులు వీసా, పాస్‌పోర్టు తాలూకు దరఖాస్తులను ఈ కేంద్రంలో సమర్పించాలని కోరింది. ఈ పనివేళలను ప్రవాసులు దృష్టిపెట్టుకుని అసౌకర్యానికి గురికాకుండా ముందే ప్రణాళిక ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలని ఎంబసీ సూచించింది. కువైత్ సిటీ బీఎల్ఎస్ సెంటర్‌లో దరఖాస్తు సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్న ప్రవాసులు 65506360 నం.కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు.     

Updated Date - 2022-06-13T14:53:46+05:30 IST