విద్యాభారత్ కు గతుకుల బాట

ABN , First Publish Date - 2020-08-07T05:56:18+05:30 IST

ఈ కొత్త విద్యా విధానంలో కలవరపెట్టె అతి ముఖ్య సమస్య మితిమీరిన కేంద్రీకరణ. పాఠ్యపుస్తకాలు జాతీయ స్థాయిలోనే ఇప్పుడు తయారవబోతున్న కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌- 2021కు...

విద్యాభారత్ కు గతుకుల బాట

ఈ కొత్త విద్యా విధానంలో కలవరపెట్టె అతి ముఖ్య సమస్య  మితిమీరిన కేంద్రీకరణ. పాఠ్యపుస్తకాలు జాతీయ స్థాయిలోనే ఇప్పుడు తయారవబోతున్న కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌- 2021కు అనుగుణంగా తయారవుతాయి. రాష్ట్రాలు కొన్ని స్థానిక విషయాలు చేర్చుకునే వీలుంటుంది. అనేక కోణాలనుంచి విద్యను వ్యాపారాత్మకం కాకుండా లైట్‌గా టైట్‌గా ప్రైవేట్‌ సంస్థలను అదుపు చేస్తామంటున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను అవే స్వీయ ప్రకటన ద్వారా వెలువరిస్తాయని చెపుతున్నారు. పులులకు రేషన్‌ ఇస్తామని చెపుతున్నట్లుగా లేదూ ఇది!


నాటికొఠారి కమిషన్‌ మొదలుకొని నేటి కస్తూరి రంగన్‌ కమిటీ వరకు చాలా, చాలా ఉదాత్తమైన ఆశయాలు ప్రకటిస్తూనే ఉన్నారు. గొప్ప గొప్ప ఆశలు కలిగిస్తూనే ఉన్నారు. కాని ‘ఆచరణ’ విషయానికి వచ్చేసరికి, కావల్సిన రాజకీయ నిబద్ధత, సంకల్పబలం కొరవడి, కేవలం చింతనాపరులైన కమిటీ సభ్యుల అందమైన ఊహలుగా మాత్రమే అవి మిగులుతున్నాయి. మూడు దశాబ్దాలుగా జడత్వంలో కూరుకొనిపోయి వున్న విద్యా వ్యవస్థ, ఇప్పుడైనా ఏదో ఒక కుదుపుకు గురి అవుతున్నందుకు సంతోషించాలా, ఇది కూడా ‘ఆరంభశూరత్వం’గా మిగిలిపోతుందేమోనని నిరాశచెందాలా, తలపెట్టిన మార్పుల్లో కొన్ని ప్రమాదకరమైన ధోరణులకు బాటలు వేస్తాయోమోనని భయపడాలా... ఏమీ తెలియని విచిత్రమైన ఒక సంకట స్థితిలోకి నేడు నెట్టబడ్డాం.


గతంలోనూ గొప్ప లక్ష్యాలను రచించుకొన్నాం. కాని ప్రాథమిక పాఠశాలల్లో సుమారు ఐదు కోట్ల మంది విద్యార్థులకు కనీస స్థాయి, అక్షరాస్యత, గణిత ప్రమాణాలు లేవని, 2025 నాటికి సాధించాలని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులను ఉత్తేజితులను చేసేందుకు పుస్తక పఠనాన్ని బాగా ప్రోత్సహించాల్సి ఉందని రాసుకొచ్చారు. పాఠశాలల్లో గ్రంథాలయాలు, ఊళ్ళల్లో గ్రంథాలయాలు, డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. అతి ప్రధానమైన మార్పు పాఠశాలలకు ఇప్పుడున్న 10+-2+-3 స్థానంలో 5+-3+-3+-4 వ్యవస్థ రాబోతున్నది. తెలుగు రాష్ట్రాలలో విడిగా ఉన్న ఇంటర్మీడియట్‌ విద్య పాఠశాల విద్యలో భాగం కాబోతున్నది. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఐఐటి యన్లు తెలుగు రాష్ట్రాల నుంచి రావటానికి కారణం ఇంటర్మీడియట్‌ విద్యపై మనం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ అని వాదించే వారున్నారు. కార్పొరేట్ల ప్రభావం కూడా దీని వల్ల ఎక్కువే అని వాదించేవారున్నారు. మన పీ.వీ, చొరవతో ప్రారంభమయిన ఈ వ్యవస్థ కాలగర్భంలో కలిసిపోనున్నదా? మనకున్న ఆ ప్రత్యేకతను కోల్పోతామా? కార్పొరేట్‌ శక్తులు అప్పుడు స్కూలు విద్యపై పూర్తి స్థాయిలో పంజా విసురుతాయా? పాలకులు ఇచ్చే డైరెక్షన్‌ను బట్టి ఉంటుంది. పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలల్లో భాగం కావాలంటే ఆరోగ్య వ్యవస్థ, రవాణా వ్యవస్థ, విద్యా వ్యవస్థలు కలిసి పని చేయాలి. వీటి మధ్య అవగాహన, సహకారం కల్గించగలిగిన వ్యవస్థ తయారు కావాలి. లేనట్లయితే మూడు సంవత్సరాలు ముందుగానే ప్రయివేట్‌కు పిల్లల్ని అప్పగించే పరిస్థితి నెలకొంటుంది. డ్రాప్‌ అవుట్స్‌ను పూర్తిగా తగ్గించి 2030 నాటికి సెకండరీ విద్యా స్థాయిలో నూటికి నూరు శాతం ఎన్‌రోల్‌మెంట్‌ సాధించే మరో లక్ష్యం పెట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై పోయిన నమ్మకాన్ని తిరిగి తెస్తామని చెపుతున్నారు. హైస్కూల్‌ స్థాయి లోపే వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్పగలిగితే మంచిదని అందుకోసమై చాలా భారతీయ భాషలను, విదేశీభాషలను ఐచ్ఛికంగా ఎంచుకునేందకు అవకాశం కల్పిస్తామని చెపుతున్నారు. సంస్కృతాన్ని సంస్కృతంలోనే బోధిస్తామనీ, సంస్కృత సాహిత్యాన్ని అస్వాదించే స్థాయి రావాలని అభిలషించారు. కానీ కొన్నేళ్ళుగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది విద్యార్థులు అక్షరం ముక్క రాకుండా సంస్కృతంలో ప్రవీణులయిన సంగతి మనం మర్చిపోగూడదు. అసలు ఇన్ని భాషలు బోధించే టీచర్లు ఎక్కడ నుండి రావాలి?


అయిదవ తరగతి వరకూ ఇంటి భాషలోనే విద్యాబోధన సాగాలనే విలువైన సూచన చేశారు. కానీ చట్టం చేస్తారా? రాష్ట్రాలను అంగీకరింప చేస్తారా? ప్రైవేట్‌ సంస్థలలో కూడా దీనిని అమలు చేయాలనే నిబంధన విధిస్తారా? అటువంటి దృఢ సంకల్పం పాలకులు వ్యక్తపరుస్తారా? కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో, అదీ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే, ప్రభుత్వ పాఠశాలలకు ‘చావుగంట’ మోగించినట్లే. సెకండరీ స్థాయిలోపే వడ్రంగం, కరెంట్‌ పని, తోటపని, కుండలు చేయటం వంటి వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేస్తారట. సంవత్సరానికి పదిరోజులపాటు ‘సంచీల మోత’ లేకుండా, వృత్తి చేసేవారి వద్దకే వెళ్ళి వృత్తి నేర్చుకోవాలట. ఇది ఏ మేరకు ఆచరణ సాధ్యమో చూడాలి. గ్రేడు 10, 12కు బోర్డు పరీక్షలు ఇప్పటిలాగానే సంవత్సరానికి రెండు సార్లు ఉంటాయి. కాకపోతే 2022-----–23 విద్యా సంవత్సరానికి గాను కొత్త ఫ్రేమ్ వర్క్‌ లక్ష్యాలకు అనుగుణంగా న్యూ ఎసెస్‌మెంట్‌ సెంటరు ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉంది. అలాగే 3వ, 5వ, 8వ గ్రేడు తర్వాత తగిన స్థాయిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.


గతంలో 7వ తరగతికే కొన్నాళ్ళు పరీక్ష నిర్వహించి వదిలేశాము. ఇప్పుడు మూడు తరగతులకు బయటి వారు పరీక్ష నిర్వహించాలంటే అన్ని విషయాలు పక్కకుపోయి ఆ మూడు పరీక్షల తయారీకై మొత్తం వ్యవస్థ పూనుకునే ప్రమాదముంది. రాజ్యాంగం పరంగానూ, మానవత రీత్యా అతి ముఖ్యమయిన విలువలు సేవ, అహింస, స్వచ్ఛత, శాంతి, నిష్కామకర్మ నేర్పేందుకై పంచతంత్ర కథలు, జాతక కథలు, హితోపదేశం వంటి కథలు, రాజ్యాంగ అధికరణలకు సంబంధించిన కొన్ని భాగాలు పిల్లలు అందరికీ తప్పక చెప్తారట. అవన్నీ ఇప్పటివరకూ లేకనా! భయమెల్లా ఆ పేరుతో ఏ భావజాలాన్ని సమాజంపై రుద్దుతారోనని కదా! జవహర్‌, నవోదయ విద్యాలయాలు లేదా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మరిన్ని పెడతామని చెప్తున్నారు. మరొక ప్రక్క స్కూళ్ళను గ్రూప్‌ చేసి స్కూల్‌ కాంప్లెక్స్‌లు నెలకొలుపుతామని చెప్తున్నారు. అలాగే విద్యా వ్యవస్థకు అత్యున్నత స్థాయి, రాష్ట్ర స్థాయి నిర్ణాయక సంస్థగా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌’ ఉంటుంది. అలాగే దైనందిన కార్యకలాపాల నిర్వహణకై ‘స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్ విడిగా ఉంటుంది. అలాగే స్కూళ్ళను పరిశీలించి అది ఏ స్థాయి పాఠశాలో నిర్ణయించే ఎక్రిడిటేషన్‌ బాడీ వేరుగా ఉంటుంది. పరీక్షల నిర్వహణకు, పరీక్షల నిర్వహణ కేంద్రాలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ ఆచరణలో రాసుకున్న పద్ధతిలోనే అమలు కావాలి అంటే అందుకు ఈ పాలసీ రాసిన వారిలో మాత్రమే కాక, అన్ని స్థాయిలలో ఈ దేశాన్ని నడిపే నాయకులకూ పట్టుదల ఉండాలి. ఈ కొత్త విద్యా విధానంలో కలవరపెట్టె మరో అతి ముఖ్య సమస్య మితిమీరిన కేంద్రీకరణ. పాఠ్యపుస్తకాలు జాతీయ స్థాయిలోనే ఇప్పుడు తయారవబోతున్న కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌- 2021కు అనుగుణంగా తయారవుతాయి. రాష్ట్రాలు కొన్ని స్థానిక విషయాలు చేర్చుకునే వీలుంటుంది. ఈ పుస్తకాలు ప్రచురించి, పంపీణీ చేసే బాధ్యత ప్రభుత్వాలు తమ చేతుల్లో ఉంచుకుంటాయా? ప్రైవేట్ వారి చేతుల్లో పెడతాయా? తెలీదు.


ముఖ్యంగా ముసాయిదాలో ఉండి, ప్రకటించిన విధానంలో లేనిది వ్యాపార దృక్పథంతో నడిపే ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేస్తామన్న విషయం. సరియైన ప్రమాణాలు లేని టీచర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలను మాత్రమే మూసివేస్తామని విధానంలో పేర్కొన్నారు. పైగా అనేక కోణాలనుంచి వ్యాపారాత్మకం కాకుండా లైట్‌గా టైట్‌గా ప్రైవేట్‌ సంస్థలను అదుపు చేస్తామంటున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను వారే స్వీయ ప్రకటన ద్వారా వెలువరిస్తారని చెపుతున్నారు. ఎన్నికల సమయంలో మన రాజకీయవేత్తల ఆస్తుల ప్రకటన ఎంత నిజాయితీగా ఉంటుందో చూశాక, ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఎంత నిజాయితీగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. పులులకు రేషన్‌ ఇస్తామని చెపుతున్నట్లుగా లేదూ ఇది! ముసాయిదాలో విద్యపై పెట్టే ఖర్చు రెట్టింపు చేస్తామని దీన్ని ఇరవై శాతం దాకా తీసుకువెళతామని చెప్పారు. విధానంలోనేమో జీ.డీ.పీ.లో 6 శాతానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. పళ్ళెంలో అరవై రకాల వంటలు ఉండబోతున్నాయని, రేషన్‌ బియ్యం నాన్న తీసుకొచ్చేలోపు, పెరట్లో ఉన్న గోంగూర కాడలు తీసుకువచ్చి వంట ప్రారంభిస్తానని చెబితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ వ్యవహారం.


ఉన్నత విద్యారంగాన్ని నియంత్రించే కమిషన్‌ ఒక్కటే ఉంటుంది. 50% విద్యార్థులకు ఖర్చు లేకుండా, అంటే ఉపకార వేతనాలతోనో, ఫీజు రాయితీలతోనో చదువు చెపుతారు. 2035 నాటికి ఎన్‌రోల్‌మెంట్‌ శాతాన్ని 50 వరకూ తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ ఇంతకుముందు యశపాల్‌ కమిటీలోనూ, సి.యన్‌.రావు కమిటీలోనూ ఉన్నవే. ప్రతి జిల్లాలో ఒక ‘మోడల్‌ మల్టీ డిసిప్లనరీ ఎడ్యుకేషన్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ యూనివర్శిటీ’ని ప్రారంభిస్తామని చెపుతున్నారు. ఎఫ్లియేషన్‌ వ్యవస్థను తీసివేస్తామనీ, అన్ని డిగ్రీ కళాశాలలను అటానమస్‌ చేస్తామని బయటి వ్యక్తుల జోక్యానికి తావు లేకుండా చేస్తామని చెపుతున్నారు. జాతీయ విద్యా కమీషన్‌, రాష్ట్ర విద్యా కమీషన్ల ఊసు విధానంలో లేకుండా పోయింది. ఉపాధ్యాయ నియామకాలపై హామీ లేదు. మొదటి వంద ర్యాంకులలోని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తామని చెపుతున్నారు. వీటితో మన ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు పోటీ పడలేక చతికలపడితే నష్టపోయేది పేద, గ్రామీణ భారతమే కదా!


విద్యాశాఖ, సెంట్రల్‌ ఎడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు, యన్‌.సి.ఇ.ఆర్‌.టి., యస్‌.సి.ఇ.ఆర్‌.టీ., హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు, యూనివర్శిటీలు.. ఇలా అనేక సంస్థలు కలిసి, విడి విడిగా, ప్రణాళికాబద్ధంగా కొత్త విద్యా విధానం అమలుకు పూనుకోవాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన పాలసీ పాయింట్లు 130 దాకా ఉన్నాయి. కొన్ని వెంటనే, కొన్ని కాస్త ఆలశ్యంగా అన్నింటికీ వనరులు పుష్కలంగా కావాలి. ఇందుకు కావాల్సిన రాజకీయ సంకల్పం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సెక్యులరిస్ట్‌ ధోరణి మనకు ఉన్నాయా? లేనట్లయితే తమకు నచ్చినవి చేసి, నచ్చనివి అటకెక్కించే ప్రభుత్వాలు నూతన విద్యా విధానాన్ని ‘అయ్య వారిని చెయ్యబోతే...’ అన్న సామెతలా తయారు చేస్తారు.


-ఐ.వి. రమణారావు

Updated Date - 2020-08-07T05:56:18+05:30 IST