Abn logo
Jul 16 2020 @ 08:23AM

ఇండియ‌న్ డ్రోన్ బాయ్‌కు టోక్యో వేదికపై గోల్డ్‌ మెడల్ ‌!

నిరుపేద రైతు కుటుంబానికి చెందిన ఆ కుర్రాడి కలలు ఆకాశంలో విహరించాయి. పట్టుదలతో డ్రోన్ల తయారీకి నడుం బిగించాడు. ‘డ్రోన్‌’ ప్రాజెక్టులతో ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. అనేక పురస్కారాలు అందుకున్నాడు. ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోదీ దృష్టిలో పడ్డాడు. ‘ఈ యువ శాస్త్రవేత్త సేవలను వినియోగించుకోవాల’ని బెంగళూరులోని రక్షణా పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ)కు కేంద్రం సూచన చేసినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ‘డ్రోన్‌బాయ్‌’గా పేరొందిన 23 ఏళ్ల యువ శాస్త్రవేత్త ఎన్‌.ఎం.ప్రతాప్‌ అద్భుతాలకు సంబంధించిన కథనాలు పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. ‘డిఆర్‌డిఓతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తే అంతకంటే గొప్ప అదృష్టం మరేమీ ఉండద’ని చెబుతున్న ప్రతాప్‌ ‘నవ్య’తో ముచ్చటించారు. ఆ విశేషాలే ఇవి... 


‘‘మాది మండ్య జిల్లా(కర్ణాటక)లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు పట్టుపెంపకం చేస్తుంటారు. ఉన్న అర ఎకరంలో అందరం కలిసి ఏడాదంతా కష్టపడినా రూ.15వేలు కూడా వచ్చేవి కావు. నాకు చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అంటే ఇష్టం. పొలం పనులు చేసుకుంటూనే పనికిరాని పాత టేప్‌ రికార్డర్‌లు, రేడియోలు, మిక్సీలకు సంబంధించిన రకరకాల వైర్లు సేకరించి ప్రయోగాలు చేసేవాడిని. బంధువులు, స్నేహితులు నన్ను పిచ్చోడిలా చూసేవారు. పీయూసీ (ఇంటర్‌) పాసైన తర్వాత నాన్న దగ్గర రూ.8వేలు తీసుకుని మైసూరుకు వెళ్లి జేఎస్‌ఎస్‌ కాలేజీలో బీఎస్సీలో చేరా. ఓవైపు చదువుకుంటూనే ఆకాశంలో ఎగిరే వస్తువు తయారీ ప్రయత్నాలు కొనసాగించా. దాన్ని ‘డ్రోన్‌’ అంటారనే సంగతి కూడా నాకు తెలియదు. రకరకాల వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసుకున్నా. డిగ్రీ మూడో సంవత్సరంలో ఉండగా హాస్టల్‌ ఫీజు కట్టలేదని బయటకు పంపేశారు. బస్టాండ్‌, ప్లాట్‌ఫామ్‌లపై గడిపా. పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో బట్టలు ఉతుక్కునేవాడిని. పిల్లలకు ట్యూషన్‌ చెప్పి కొంత ఆదాయాన్ని సమకూర్చుకున్నా. 


తొలి పోటీలోనే విజయం...  

ఆకాశంలో ఎగిరే యంత్రం తయారు చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లను కష్టపడి నేర్చుకున్నా. మైసూరులో ఉన్నప్పుడే డ్రోన్‌ ప్రయత్నాలు 80సార్లు చేసి విఫలమయ్యా. చివరికి నా డ్రోన్‌ 700 అడుగుల ఎత్తుకు ఎగిరింది. జాతీయస్థాయిలో డ్రోన్‌ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిసి జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో మూడు రోజులు ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నా. అక్కడ నాకు తొలి ప్రయత్నంలోనే రెండో బహుమతి లభించడం ఉత్సాహాన్నిచ్చింది. అప్పటి నుంచి డ్రోన్ల తయారీపై మరింత దృష్టి నిలిపాను.


2017లో జపాన్‌లో ఐఐటి స్థాయి విద్యార్థులకు డ్రోన్‌ పోటీలు నిర్వహిస్తున్నారని తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నా. అయితే వీసా, పాస్‌పోర్ట్‌ ఉంటాయన్న సంగతి నాకు తెలియదు. శ్రేయోభిలాషులు, స్నేహితులు, ప్రొఫెసర్‌లు సాయం చేయడంతో తత్కాల్‌ పాస్‌పోర్ట్‌, వీసా సంపాదించా. 


టోక్యో వేదికపై గోల్డ్‌ మెడల్‌! 

ఎట్టకేలకు నేను ఒంటరిగా టోక్యోకు వెళ్లా. 127కుపైగా దేశాలు పాల్గొన్న ఆ ఎక్స్‌పోలో నా స్థానం 70కి దరిదాపుల్లో ఉంటుందనుకున్నా. 60వ స్థానం వరకు విజేతల పేర్లు వచ్చాయి. అందులో నా పేరు లేదు. పదిలోపు జాబితా ప్రకటిస్తున్నారు. 9వరకు అమెరికా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల పేర్లు వచ్చాయి. చివరగా నెంబర్‌వన్‌ కోసం ‘మిస్టర్‌ ప్రతాప్‌... గోల్డ్‌ మెడలిస్ట్‌’ అని పిలుస్తుంటే నమ్మలేకపోయా. ఒక్కసారిగా నా కళ్లు చెమర్చాయి. భారత జాతీయ పతాకాన్ని చేబూని వేదిక ఎక్కి, 10వేల డాలర్ల బహుమతి అందుకున్న ఆ మధుర క్షణాలు ఎన్నటికీ మరువలేనివి. జపాన్‌లో నా డ్రోన్‌ మోడల్‌కు ప్రథమ బహుమతి లభించాక నెలకు రూ. 16 లక్షల జీతం, ఇల్లు, రూ.2.5కోట్లు విలువ చేసే కారు ఇస్తామని ఫ్రాన్స్‌ దేశం నుంచి ఆహ్వానం అందింది. ఫ్రాన్స్‌ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లి అక్కడి సాంకేతికతను నేర్చుకుని తిరిగి భారత్‌కు వచ్చేశా. భారతమాతకే నా సేవలు అందించాలన్న సంకల్పమే ఇందుకు కారణం. 


వందలాది డ్రోన్‌లు... 400 ఉపన్యాసాలు! 

డ్రోన్‌లపై నా పరిశోధనలను నిత్యం కొనసాగించా. వందలాది డ్రోన్‌లను తయారు చేశా. ఈ డ్రోన్‌ల తయారీ కోసం ఇ-వ్యర్థాలను వినియోగించా. సరిహద్దుల్లో నిఘా కోసం ప్రత్యేక డ్రోన్‌లను రూపొందించా. ఉత్తర కర్ణాటకలో వరదలు సంభవించినప్పుడు మందులను చేరవేసేందుకు వీలుగా డ్రోన్‌లను సిద్ధం చేశా. ఆఫ్రికాలోనూ నిర్వహించిన డ్రోన్‌ల సాయంతో ప్రకృతి వైపరీత్యాల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నా. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం నిఘా విషయంలోనూ సహాయ కార్యక్రమాలకు డ్రోన్‌లు బాగా ఉపయోగపడతాయని నిరూపించా. 25 దేశాలు పర్యటించి వందకుపైగా డ్రోన్‌ ప్రదర్శనలు, పోటీలలో పాల్గొన్నా. పలు యూనివర్శిటీలు, స్వచ్ఛంద సంస్థల పిలుపుమేరకు 400కుపైగా ఉపన్యాసాలు ఇచ్చాను. 


డ్రోన్‌లను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలన్న నా సంకల్పం నెరవేరేంతవరకు విశ్రమించను. బెంగళూరులో ఇప్పటికే ఏరోస్పేస్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకుని డ్రోన్‌లపై పరిశోధనలు చేస్తున్నా. ఇంతవరకు నేను తయారు చేసిన వందలాది డ్రోన్‌లలో 100 గ్రాముల బరువైన బుల్లిడ్రోన్‌తోపాటు 10కిలోల బరువైన పెద్ద డ్రోన్‌లు కూడా ఉన్నాయి. నేను తయారు చేసిన డ్రోన్‌లన్నీ వ్యవసాయం, తోటలు, సహాయ కార్యక్రమాలు, రక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడేవే. దేశానికి నేను చేస్తున్న సేవ చిన్నదే కావొచ్చు... కానీ అది నా దృష్టిలో గొప్ప సేవగా భావిస్తున్నా.’’ 


- అబ్దుల్‌ రజాక్‌, బెంగళూరు

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement