భారతీయుల కోసం ఉక్రెయిన్‌లోనే ఉండిపోయిన డాక్టర్

ABN , First Publish Date - 2022-03-06T00:18:09+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామని ఆలోచిస్తుంటే, ఒక భారతీయ డాక్టర్ మాత్రం అందరినీ ఇండియాకు పంపించిన తర్వాతే తిరిగొస్తానంటున్నాడు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులందరూ తిరిగి వెళ్లాకే, తాను ఆ దేశాన్ని వీడతానంటున్నాడు.

భారతీయుల కోసం ఉక్రెయిన్‌లోనే ఉండిపోయిన డాక్టర్

కీవ్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామని ఆలోచిస్తుంటే, ఒక భారతీయ డాక్టర్ మాత్రం అందరినీ ఇండియాకు పంపించిన తర్వాతే తిరిగొస్తానంటున్నాడు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులందరూ తిరిగి వెళ్లాకే, తాను ఆ దేశాన్ని వీడతానంటున్నాడు. కోల్‌కతాకు చెందిన పృథ్వీరాజ్ ఘోష్ ఉక్రెయిన్‌లో డాక్టర్‌గా, స్టూడెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం భారతీయుల్ని తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ స్వదేశానికి తిరిగొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పృథ్వీరాజ్ ఘోష్ మాత్రం ఇప్పుడప్పుడే తాను ఉక్రెయిన్‌ వదలనంటున్నాడు. అక్కడ చదువుకుంటున్న భారతీయుల్లో తన స్టూడెంట్లు చాలా మంది ఉన్నారని, వాళ్లందరిని క్షేమంగా స్వదేశానికి పంపించడం తన బాధ్యత అంటున్నాడు.


‘నిజానికి నేను ఇక్కడ చిక్కుకుపోలేదు. కావాలనే ఉండిపోయా. ఇక్కడ చిక్కుకున్న భారతీయులందరినీ ఇండియాకు పంపించేందుకు ప్రయత్నిస్తా. ఇప్పటికే 350 మందికిపైగా విద్యార్థులకు సాయం చేశా. సుమీ, ఖార్కివ్‌తోపాటు చాలా ప్రాంతాల్లో రెండు వేలకుపైగా విద్యార్థులు చిక్కుకున్నారు. వాళ్లందరికీ సాయం చేస్తా. వాళ్లకు ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు. నన్నే నమ్ముకొని ఉన్నారు. వాళ్లని వదిలి ఎలా వస్తా. అందరినీ పంపించాకే తిరిగొస్తా’ అంటూ పృథ్వీరాజ్ తన పేరెంట్స్‌తో వీడియో కాల్‌లో చెప్పారు. పృథ్వీరాజ్ నిర్ణయంపై ఇండియాలో ఉన్న అతడి తల్లిదండ్రులు ఒకవైపు గర్వపడుతూనే, మరోవైపు ఆందోళనకు గురవుతున్నారు. తమ కొడుకుతోపాటు, ఇతర విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-03-06T00:18:09+05:30 IST