ఆల్‌రౌండ్‌ షో

ABN , First Publish Date - 2021-03-10T10:34:03+05:30 IST

ఏడు వరుస విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌ జట్టుకు బ్రేక్‌ పడింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి మిథాలీ రాజ్‌ బృందం గట్టిగానే బదులు తీర్చుకుంది...

ఆల్‌రౌండ్‌ షో

  • చెలరేగిన స్మృతీ మంధాన 
  • గోస్వామికి నాలుగు వికెట్లు
  • రెండో వన్డేలో భారత మహిళల విజయం

లఖ్‌నవూ: ఏడు వరుస విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌ జట్టుకు బ్రేక్‌ పడింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి మిథాలీ రాజ్‌ బృందం గట్టిగానే బదులు తీర్చుకుంది. మొదట బౌలింగ్‌లో వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి (4/42) ప్రత్యర్థిని కట్టడి చేయగా ఆతర్వాత స్టార్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన (64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 నాటౌట్‌), పూనమ్‌ రౌత్‌ (89 బంతుల్లో 8 ఫోర్లతో 62 నాటౌట్‌) అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీ్‌సలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. మూడో వన్డే శుక్రవారం జరుగుతుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్‌ 41 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గోస్వామి ధాటికి లారా గుడెల్‌ (49), లూస్‌ (36) మినహా అంతా విఫలమ య్యారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌కు మూడు, మాన్సికి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారత్‌ 28.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది.




స్మృతి హవా: స్వల్ప ఛేదనలో భారత్‌ ఐదో ఓవర్‌లోనే ఓపెనర్‌ జెమీమా (9) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో ఓపెనర్‌ స్మృతి, పూనమ్‌ సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. తొలి ఓవర్‌లోనే స్మృతి వరుసగా రెండు సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటుకుంది. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లతో స్కోరును పెంచుతూ 46 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అటు పూనమ్‌ అడపాదడపా బౌండరీలు బాదుతూ చివరి వరకు క్రీజులో నిలిచింది. అటు ఈ జోడీని విడదీసేందుకు ప్రొటీస్‌ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. 29వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లతో స్మృతి మ్యాచ్‌ను ముగించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 138 పరుగుల భాగస్వామ్యం అందించడం విశేషం.


సంక్షిప్త స్కోర్లు

దక్షిణాఫ్రికా: 41 ఓవర్లలో 157 ఆలౌట్‌ (లారా గుడెల్‌ 49, లూస్‌ 36, గోస్వామి 4/42, గైక్వాడ్‌ 3/37). 

భారత్‌: 28.4 ఓవర్లలో 160/1 (స్మృతీ మంధాన 80 నాటౌట్‌, పూనమ్‌ 62 నాటౌట్‌).


Updated Date - 2021-03-10T10:34:03+05:30 IST