Advertisement
Advertisement
Abn logo
Advertisement

హలాల్ చేసిన మాంసం మాత్రమే.. టీమిండియా క్రికెటర్ల డైట్ నుంచి బీఫ్, పోర్క్ ఔట్!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల డైట్ ప్లాన్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ మార్పులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాళ్ల డైట్‌లో ఇకపై బీఫ్, పోర్క్ ఉండబోదని, ఈ రెండింటినీ నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండు ఏ రూపంలోనూ ఉండబోవని, హలాల్ చేసిన మాత్రాన్ని మాత్రమే వడ్డించనున్నట్టు ఓ నోట్‌లో పేర్కొంది. అంతేకాదు, దానిపై ‘ఇంపార్టెంట్’ అని నొక్కి చెప్పడంపై నెటిజన్లు, అభిమానులు మండిపడుతున్నారు. 

 


ఆహారం విషయంలో ఆటగాళ్ల ఇష్టాఇష్టాలను ఎలా నియంత్రిస్తారని ప్రశ్నిస్తున్నారు. బీఫ్, పోర్క్ వద్దనుకోవడం వరకు ఓకే కానీ, హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే ఎందుకు పెట్టాలనుకుంటున్నారో కొంచెం చెప్పాలంటూ మండిపడుతున్నారు. నిజానికి ఆటగాళ్ల ఆహార ప్రణాళికను బోర్డు నుంచి రాలేదు. హోస్ట్ బోర్డు  బీసీసీఐ ద్వారా మాత్రమే క్యాటరింగ్ అవసరాలను జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. బీసీసీఐ కేవలం ఆహార ప్రణాళికను మాత్రమే కాకుండా సెక్యూరిటీ, లాజిస్టిక్స్ వంటివాటిని కూడా హోస్ట్ బోర్డుతో పంచుకుంటుంది.

 

మరీ ముఖ్యంగా భారత జట్టు విదేశాల్లో పర్యటించేటప్పుడు ఆహార ప్రణాళికను చాలాసార్లు పంచుకుంది. అంతర్జాతీయ టోర్నీల్లోనూ ఇదే జరిగింది. అయితే, ప్రస్తుతం హలాల్ చేసిన మాంసం మాత్రమే  ఉండాలని చెప్పడాన్ని బట్టి న్యూజిలాండ్‌తో తలపడే భారత జట్టులో ముస్లిం ఆటగాడు ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. కాన్పూరు టెస్టు కోసం కివీస్ జట్టు ఆహార ప్రణాళికను పంపింది.

 

 ‘‘శిక్షణ, గేమ్స్ కోసం ఆటగాళ్లు అవసరమైన శక్తి, పోషకాలు పొందేందుకు ఆహారంలో ఓ మోస్తరు స్థాయిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, తక్కువ మొత్తంలో కొవ్వు ఉండేలా చూసుకోవాలి. తయారుచేసే ఆహారం వీలైనంత వరకు తాజాగా ఉండాలి’’ అని న్యూజిలాండ్ తన ఆహార ప్రణాళికలో పేర్కొంది. జట్టులోని కొందరు ఆటగాళ్లకు అలెర్జీ ఉందని, కాబట్టి వారి కోసం ప్రత్యేక ఆహారం అవసరమని అందులో పేర్కొంది. 


లంచ్ బ్రేక్ ఇలా..

* రెడ్ మీట్ - బీఫ్ లేదంటే గొర్రెపిల్ల

 * వైట్ మీట్ - చికెన్, చేపలు లేదంటే పోర్క్ 

 * కార్బోహైడ్రేట్ - బంగాళదుంపలు, పొడవైన అన్నం, పాస్తా, ఉత్తరాఫ్రికా వంటకమైన కౌస్‌కౌస్ 

* రెండు శాకాహార వంటకాలు - ఒక సలాడ్, పండు 


కాగా, ఇండియా, న్యూజిలాండ్ జట్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత తొలిసారి టెస్టు సిరీస్‌లో తలపడబోతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో రోహిత్ సేన కైవసం చేసుకుంది.


కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో ఈ టెస్టు సిరీస్‌కు భారత జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహిస్తాడు. డిసెంబరు 3 నుంచి ముంబైలో ప్రారంభం కానున్నరెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉంటాడు. 

Advertisement
Advertisement