‘36’ను ఓ బ్యాడ్జిలా ధరించండి..

ABN , First Publish Date - 2021-01-23T09:22:36+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్‌ జట్టు చూపిన అసమాన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. అవమానాలు.. కఠిన సవాళ్లతో పాటు

‘36’ను ఓ బ్యాడ్జిలా ధరించండి..

  • అడిలైడ్‌ ఓటమి తర్వాత రవిశాస్త్రి భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ వెల్లడి


హైదరాబాద్‌: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్‌ జట్టు చూపిన అసమాన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. అవమానాలు.. కఠిన సవాళ్లతో పాటు కీలక ఆటగాళ్ల గైర్హాజరీని తట్టుకుంటూ జట్టు బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీతో సగర్వంగా స్వదేశానికి చేరింది. తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటైన వేళ తిరిగి కోలుకునేందుకు మిషన్‌ మెల్‌బోర్న్‌ ఎలా సాగింది? బ్యాట్స్‌మన్‌ను కాదని జడేజాను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కోహ్లీ, శాస్త్రి ఇచ్చిన ప్రేరణతో జట్టు తిరిగి జైత్రయాత్ర సాగించిన వరకు తెర వెనుక ఏం జరిగిందనే విషయాలను టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న హైదరాబాదీ ఆర్‌.శ్రీధర్‌ వెల్లడించాడు.  


‘36’ను గుర్తుంచుకోండి..

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 36 పరుగులకే ఆలౌటైన తర్వాత జట్టులో స్తబ్దత నెలకొంది. ఆ మ్యాచ్‌ ముగిసిన రోజు అర్ధరాత్రి నాకు కెప్టెన్‌ కోహ్లీ నుంచి.. ఏం చేస్తున్నావంటూ మెసేజ్‌ వచ్చింది. నేను కాస్త ఆశ్చర్యానికి లోనై కోచ్‌ శాస్ర్తి, భరత్‌ అరుణ్‌, విక్రమ్‌ రాథోడ్‌తో కలిసున్నానని చెప్పా. దీంతో తను కూడా మాతో చేరాడు. అప్పుడే మా మధ్య మిషన్‌ మెల్‌బోర్న్‌ చర్చ జరిగింది. మరోవైపు శాస్త్రి మాట్లాడుతూ.. 36 సంఖ్యను అందరూ ఓ బ్యాడ్జీలా ధరించండి.. కచ్చితంగా మనం గొప్ప జట్టుగా రూపొందుతామని ఉత్తేజాన్ని నింపాడు. 40 రోజుల తర్వాత అదే నిజమైంది.


జడేజాతో మాస్టర్‌ స్ట్రోక్‌..

అడిలైడ్‌ పరాజయం తర్వాత భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బ్యాటింగ్‌ విభాగాన్ని కాకుండా బౌలింగ్‌ను పటిష్ఠం చేసుకోవాలనుకుంది. మ్యాచ్‌ ముగిసిన మర్నాడు రహానెతో కోహ్లీ సమావేశమై జట్టు కూర్పు గురించి చర్చించాడు. 36 పరుగులకు ఆలౌటైతే సహజంగా బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తారు. కానీ, మేము బౌలింగ్‌లో సత్తా చూపాలనుకున్నాం. అందుకే కోహ్లీ స్థానంలో జడేజాను తీసుకున్నాం. అది నిజంగా ఆసీస్‌కు మాస్టర్‌స్ట్రోక్‌ అయ్యింది.


విహారి స్ఫూర్తితోనే..

సిడ్నీ టెస్టులో గాయం బాధపెడుతున్నా విహారి బ్యాటింగ్‌ చేసిన తీరు అద్భుతం. మ్యాచ్‌ ముగిశాక అతడు కుర్చీలో నుంచి లేవలేకపోయాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరాక.. సర్‌, ఇదేగా మీరు అడిగింది. ఈ పరిస్థితిలో ఇంతకు మించి ఆడలేను.. అని విహారి నాతో అన్నాడు. పెయిన్‌ కిల్లర్స్‌తో అతడు సాగించిన పోరాట స్ఫూర్తితోనే బ్రిస్బేన్‌లోనూ ఆడగలిగాం. ఆ టెస్టులో పంత్‌, సుందర్‌కు మేం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. పరిస్థితికి తగ్గట్టు వారే ఆడారు. వారిద్దరిని అలా వదిలేయండి.. ఫలితం ఎలా వచ్చినా ఓకేనంటూ రహానె, రవిశాస్ర్తి ఆ సమయంలో చెప్పారు. నేను మాత్రం ఉత్కంఠ భరించలేకపోయా. వారిద్దరి బ్యాటింగ్‌ సమయంలో నా పల్స్‌ రేట్‌ చెక్‌ చేసుకుంటే 120గా చూపింది. ఓ గంటలో పదేళ్ల వయస్సు పెరిగానేమోననిపించింది.


లీడర్‌షిప్‌ కాదు రవిషిప్‌..

కోచ్‌గా రవిశాస్త్రి జట్టును నడిపించిన తీరు అమోఘం. బ్రిస్బేన్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందు నటరాజన్‌ గురించి మాట్లాడుతూ తను బుమ్రాకు ఏమాత్రం తక్కువ కాదని, అలాగే సుందర్‌ కూడా అశ్విన్‌తో సమానమేనంటూ ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను మార్చాడు. 


అతడి హెచ్చరికతోనే..

యూఏఈ నుంచి ఆసీస్‌ వెళ్లడానికి రెండ్రోజుల ముందు మాకు బోర్డు నుంచి ఓ సమాచారం అందింది. ఆసీస్‌ టూర్‌కు క్రికెటర్ల ఫ్యామిలీలకు అనుమతి లేదని ప్రకటించారు. అప్పటికే ఏడుగురు క్రికెటర్లు తమ భార్యాపిల్లలను యూఏఈకి రప్పించారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మూడు నెలలపాటు ఫ్యామిలీకి దూరంగా ఎలా ఉండగలమని క్రికెటర్లు అసంతృప్తి చెందారు. అయితే  కోచ్‌ రవిశాస్త్రి మాత్రం ఫ్యామిలీలను అనుమతించకపోతే జట్టు ఆసీ్‌సకు వెళ్లదని, మీరేం చేసుకుంటారో చేసుకోమంటూ బోర్డుకు గట్టి హెచ్చరిక పంపాడు. దీంతో బోర్డు మెత్తబడడంతో టూర్‌ సజావుగా ముగిసింది.

Updated Date - 2021-01-23T09:22:36+05:30 IST