డిజిటల్ సర్వీసులు ప్రారంభించిన.. సౌదీలోని భారత కాన్సులేట్

ABN , First Publish Date - 2021-04-11T23:39:42+05:30 IST

సౌదీ అరేబియాకు ఉపాధి కోసమో లేదా హాజ్ యాత్రకు, ఇతర కారణాలతో వెళ్లిన భారతీయులు అక్కడ చనిపోతే స్వదేశంలోని వారి కుటుంబ సభ్యులకు మరణ ధృవపత్రం పొందడం చాలా కష్టం.

డిజిటల్ సర్వీసులు ప్రారంభించిన.. సౌదీలోని భారత కాన్సులేట్

జెడ్డా: సౌదీ అరేబియాకు ఉపాధి కోసమో లేదా హజ్ యాత్రకు, ఇతర కారణాలతో వెళ్లిన భారతీయులు అక్కడ చనిపోతే స్వదేశంలోని వారి కుటుంబ సభ్యులకు మరణ ధృవపత్రం పొందడం చాలా కష్టం. అలాంటి వారి కోసం జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ డిజిటల్ సర్వీసులు ప్రారంభించింది. దీంతో ఆన్‌లైన్ ద్వారా వివిధ ధృవ పత్రాలను ఇక్కడి నుంచే సులువుగా పొందే వీలు ఏర్పడింది. ఇక తాజాగా డిజిటల్ సర్వీసులు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్‌లోని సంతోష్ నగర్‌కు చెందిన ఖాజా బేగం భర్త గులాం సందానీ మరణ పత్రాన్ని కాన్సులేట్ అధికారులు ఈ-మెయిల్ ద్వారా పంపించారు. 2019లో గులాం సందానీ ఉమ్రా యాత్ర కోసం కుటుంబంతో కలిసి సౌదీ వెళ్లాడు. కానీ, అనారోగ్యంతో అక్కడే మృతిచెందాడు. సందానీ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయనకు పెన్షన్ వచ్చేది. ఆయన మృతి తర్వాత పెన్షన్ ఆగిపోయింది. 


అధికారులు సందానీ మరణ ధృవపత్రం తేస్తే గానీ పించన్ ఇవ్వడం కూదరదని తేల్చి చెప్పేశారు. దాంతో ఖాజా బేగంకు సందానీ డేత్ సర్టిఫికేట్ తప్పనిసరియైంది. దీనికోసం ఆమె చాలా ప్రయత్నించింది. కానీ, సౌదీ అధికారుల నుంచి సరియైన రెస్పాన్స్ లేకపోవడంతో సర్టిఫికేట్‌పై ఆశలు వదులుకుంది. ఈ క్రమంలో తాజాగా భారత కాన్సులేట్ డిజిటల్ సేవలను తీసుకురావడంతో.. కాన్సులేట్ అధికారుల వద్ద తన గోడును వెళ్లబోసుకుంది ఖాజా బేగం. ఆమె అభ్యర్థనకు స్పందించిన అధికారులు ఇటీవల ఖాజా బేగంకు  ఈ-మెయిల్ ద్వారా ఆమె భర్త మరణ ధృవపత్రాన్ని పంపించారు. ఇలా ఇక్కడి నుంచే ఆమె సులువుగా డేత్ సర్టిఫికేట్ పొందింది. ఇక డిజిటల్ సర్వీసులతో పాటు త్వరలోనే సౌదీ అరేబియాలో ఉన్నా, స్వదేశానికి తిరిగి వచ్చినా భారతీయ పౌరులందరికీ ఉపయోగపడే మొబైల్ యాప్‌ను కాన్సులేట్ ప్రారంభించనుంది.

Updated Date - 2021-04-11T23:39:42+05:30 IST