క‌రోనాపై భార‌త్‌ పోరాటం.. యూఏఈలోని ఎన్నారైల‌ సహాయం కోరిన ఇండియ‌న్ కాన్సులేట్‌

ABN , First Publish Date - 2020-04-04T18:21:12+05:30 IST

భార‌త్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా ప్ర‌బ‌లుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 3వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 86 మంది మ‌ర‌ణించారు.

క‌రోనాపై భార‌త్‌ పోరాటం.. యూఏఈలోని ఎన్నారైల‌ సహాయం కోరిన ఇండియ‌న్ కాన్సులేట్‌

దుబాయి: భార‌త్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా ప్ర‌బ‌లుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 3వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 86 మంది మ‌ర‌ణించారు. రోజురోజుకీ త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్న కొవిడ్‌-19పై మాతృభూమి చేస్తున్న పోరాటానికి విరాళాలు అందించి స‌హాయం చేయాల‌ని  దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ శుక్రవారం యూఏఈలోని ప్రవాసులను కోరింది. యూఏఈలో స్థిర‌ప‌డిన కేర‌ళ‌కు చెందిన‌ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త, లూలూ గ్రూపు చైర్మ‌న్‌ ఎంకే యూసుఫ్ అలీ... క‌రోనాపై భార‌త్ చేస్తున్న పోరాటానికి త‌న‌వంతు సాయంగా గురువారం రూ. 25కోట్లు విరాళం అందించారు.


పీఎం కేర్స్ ఫండ్‌కు అలీ ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఇండియ‌న్ కాన్సులేట్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ... ప్ర‌ధాని మోదీ పిలుపు మేర‌కు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ వివ‌రాల‌ను తెలియ‌జేసింది. ఈ విరాళాల‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ఉన్న విష‌యాన్ని కూడా గుర్తు చేసింది. తదుపరి ట్వీట్‌లో కాన్సులేట్ pmindia.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా విరాళాలు ఎలా ఇవ్వవచ్చో వివరాలను తెలిపింది. అలీ కూడా తాను విరాళం ప్ర‌క‌టించిన విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తేలియ‌జేశారు. కొవిడ్‌-19కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి నేను #PMCaresFundకు 25 కోట్ల రూపాయలు అందించాను అని అలీ ట్వీట్ చేశారు. 


అలాగే గ‌ల్ప్ దేశాల్లో స్థిర‌ప‌డిన కేరళ మిలియ‌నీర్స్ కూడా సొంత రాష్ట్రానికి విరాళాలు ప్ర‌క‌టించారు. విరాళాలు అందించిన వారిలో ఎంకే యూసుఫ్ అలీ, ర‌వి పిళ్ల‌య్‌, షోహాన్ రాయ్ త‌దిత‌రులు ఉన్నారు. యూసుఫ్ అలీ రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించ‌గా, ర‌వి పిళ్ల‌య్ రూ. 5 కోట్లు ఇచ్చారు. మారినర్ షోహాన్ రాయ్ 10 వెంటిలేట‌ర్స్‌తో పాటు త్రిస్సుర్‌లోని త‌న 9000 sq.ft ఇంటిని ఐసోలేష‌న్ కోసం ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు. అలాగే ప్ర‌ముఖ ఆభ‌ర‌ణాల విక్ర‌య‌దారు జాయ్ అలుక్కాస్ 36 విల్లాలను ఐసోలేషన్ వార్డులుగా వినియోగించుకోవాల‌ని ఆఫ‌ర్ చేశారు. వీటిని కాసర్గోడ్‌లో ఎండోసల్ఫాన్ బాధితులకు పునరావాసం కల్పించడంలో భాగంగా అతని ఫౌండేషన్ నిర్మించింది. ఇలా మిలియ‌నీర్స్ భారీ మొత్తంలో విరాళాలు అందించి సొంత రాష్ట్రం క‌రోనాపై చేస్తున్న పోరాటానికి త‌మ వంతు సాయం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-04T18:21:12+05:30 IST