యాంటీ మైనారిటీ ఇమేజ్‌తో ఇండియన్ కంపెనీలకు ఇబ్బందులు : రఘురామ్ రాజన్

ABN , First Publish Date - 2022-04-22T19:51:14+05:30 IST

దేశానికి యాంటీ మైనారిటీ ఇమేజ్ రావడం వల్ల ఇండియన్ ప్రొడక్ట్స్‌కు

యాంటీ మైనారిటీ ఇమేజ్‌తో ఇండియన్ కంపెనీలకు ఇబ్బందులు : రఘురామ్ రాజన్

న్యూఢిల్లీ : దేశానికి యాంటీ మైనారిటీ ఇమేజ్ రావడం వల్ల ఇండియన్ ప్రొడక్ట్స్‌కు మార్కెట్‌లో నష్టం జరుగుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఇటువంటి ఇమేజ్ వల్ల భారత దేశం నమ్మదగిన భాగస్వామి కాదని విదేశీ ప్రభుత్వాలు భావించే అవకాశం ఉందన్నారు. ఆయన ప్రస్తుతం చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.


టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో రాజన్ మాట్లాడుతూ, భారత దేశం పేద దేశమని, ప్రజలందరినీ గౌరవించే ప్రజాస్వామిక దేశమని ఇతరులు భావించినపుడు, మనకు ఎక్కువ సానుభూతి దొరుకుతుందన్నారు. మంచి పని చేయడానికి ప్రయత్నించే దేశం నుంచి నేను ఈ వస్తువును కొంటున్నానని వినియోగదారుడు భావించినపుడు మన మార్కెట్లు వృద్ధి చెందుతాయన్నారు. 


ఎవరిపైన దయ చూపించాలో నిర్ణయించుకునేవారు కేవలం వినియోగదారులు మాత్రమే కాదని, అంతర్జాతీయ సంబంధాల్లో ఆత్మీయత కూడా ఇటువంటి భావనల ద్వారా నిర్ణయమవుతుందని చెప్పారు. మైనారిటీలను ఏవిధంగా చూస్తున్నారనేదానిపై ఆధారపడి విదేశీ ప్రభుత్వాలు ఓ దేశం నమ్మదగిన భాగస్వామి ఔనా? కాదా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాయన్నారు. 


టిబెటన్లు, వీఘర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణంగా చైనా కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఉక్రెయిన్‌కు భారీ మద్దతు లభిస్తోందని, దీనికి కారణం ఆ దేశాధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ప్రపంచం విశ్వసించే ప్రజాస్వామిక భావాలను కాపాడటానికి నిలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందడమేనని చెప్పారు. సేవా రంగంలో భారతీయులకు గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రైవసీపై పాశ్చాత్య దేశాల సున్నిత భావాల పట్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. 


ఎన్నికల కమిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి రాజ్యాంగ వ్యవస్థలను అణగదొక్కడం వల్ల మన దేశ ప్రజాస్వామిక లక్షణం క్రమంగా ధ్వంసమవుతుందని హెచ్చరించారు.


 

Updated Date - 2022-04-22T19:51:14+05:30 IST