Abn logo
Sep 29 2020 @ 19:11PM

చైనా వైపు 'భీష్మ' గురి.. ఆర్మీ డేరింగ్ స్టెప్!

లద్దాఖ్: భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకొని ఉన్నాయి. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ 45 ఏళ్ల తర్వాత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడిన చైనా.. కుటిల బుద్ధితో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. ఏ క్షణమైనా యుద్ధం రావొచ్చంటూ కొన్ని చైనా పత్రికలు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాయి.

Kaakateeya

మాయదారి చైనా ఆలోచనలు సవ్యంగా ఉన్నట్లు కనిపించడంలేదు. ఏక్షణమైనా దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ పక్క చైనా ఉన్నతాధికారులు శాంతి సూత్రాలు వల్లిస్తుంటే, మరోపక్క వారి మిలటరీ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అందుకే ఎటువంటి పరిణామాలు ఎదురైనా దీటుగా ఎదుర్కోవాలని భారత్ ఓ నిశ్చయానికొచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా భారత వాయుసేన చైనా బోర్డర్‌లో ఓ ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌ ఏర్పాటు చేసింది. 24గంటలూ సరిహద్దుల్లో పహారా కాస్తోంది.

సరిహద్దుల్లో చైనా గనుక దాడి ప్రారంభిస్తే, రెండోవైపు నుంచి పాకిస్తాన్ కూడా భారత్‌పై యుద్ధం చేయడానికి రెడీగా ఉందంటూ కొన్ని చైనా పత్రికలు ప్రచురించాయి. దీంతో ఎల్‌ఏసీ వెంబడి మరింత ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, చైనా-పాక్ దేశాల మిలటరీలు రెండూ ఒకేసారి దాడి చేసినా తిప్పికొట్టే సత్తా భారత్‌కు ఉందని ఆర్మీ అధికారులు చెప్తున్నారు.

భారత వాయుసేన కూడా రంగంలోకి దిగి పాక్, చైనా బోర్డర్లకు కేవలం 50కిలోమీటర్ల దూరంలో ఫార్వర్డ్ బేస్‌ ఏర్పాటు చేసింది. ఏక్షణం ఆదేశాలు అందినా ఇక్కడి నుంచి రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. ఎల్‌ఏసీ వెంబడి ఉన్న శిబిరాలన్నింటికీ ఆహారం, ఆయుధాలు అందేలా ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్టులను కూడా రంగంలోకి దింపింది. సుఖోయ్ వంటి యుద్ధవిమానాలు కూడా 24గంటలూ ఈ శిబిరంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.

ఇప్పుడు తాజాగా భారత ఆర్మీ కూడా చైనా సరిహద్దుల్లో కఠిన చర్యలకు తెరలేపింది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భీష్మ ట్యాంకర్లను రంగంలోకి దింపింది. చుమర్-డెంచోక్ ప్రాంతాల్లో టీ90 భీష్మ, టీ72 ట్యాంకర్లతోపాటు బీఎంపీ-2 ఇన్‌ఫాంట్రీ కాంబాట్ వాహనాలను నిలబెట్టి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఈ వాహనాలు మైనస్ 40 సెల్సియస్ డిగ్రీల చలిలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయట.

లద్దాఖ్‌లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి ఎత్తయిన కొండ ప్రాంతాల్లో చలి మరీ ఎక్కువ. అయినాసరే ఈ చలికి బెదరకుండా ట్యాంకర్లను రంగంలోకి దింపాలని భారత ఆర్మీ నిర్ణయించుకుంది. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో ట్యాంకర్లను ఉపయోగించే ధైర్యం ఇప్పటి వరకూ ఏ దేశమూ చేయలేదని ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఇటువంటి కర్కశ పరిస్థితుల్లో ఆయుధాలు, ట్యాంకర్లను కండిషన్‌లో ఉంచడమే అతిపెద్ద సవాల్‌గా మారుతుందన్నారు.

ఇక్కడి చలిని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ సైన్యం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇంత చలిలో కూడా యుద్ధ ట్యాంకులు పనిచేసేందుకు మూడు రకాల ఇంధనాలు ఉపయోగించనున్నారు. ఈ ఇంధనాలతోపాటు సైనికులకు అవసరమైన ఆహారం, దుస్తులు, ఆయుధసామగ్రి తదితరాలన్నీ సముచితంగా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement