Indian Army: మానవత్వాన్ని చాటిన మన జవాన్లు.. సెల్యూట్ చేయకుండా ఉండలేరు..

ABN , First Publish Date - 2022-06-24T02:34:26+05:30 IST

రేయింబవళ్లూ దేశ రక్షణ కోసం జీవితాలను పణంగా పెట్టే భారత సైనికులు శత్రువులపై యుద్ధానికే కాదు మన అనుకున్న వాళ్లకి మానవత్వంతో..

Indian Army: మానవత్వాన్ని చాటిన మన జవాన్లు.. సెల్యూట్ చేయకుండా ఉండలేరు..

రేయింబవళ్లూ దేశ రక్షణ కోసం జీవితాలను పణంగా పెట్టే భారత సైనికులు శత్రువులపై యుద్ధానికే కాదు మన అనుకున్న వాళ్లకి మానవత్వంతో ఆపన్న హస్తం అందించే విషయంలో కూడా ముందుంటారు. తాజాగా వెలుగుచూసిన ఈ ఘటన భారత జవాన్ల ఉదార స్వభావాన్ని మరోసారి చాటిచెప్పింది. గత రెండు రోజులుగా జమ్ము మరియు కశ్మీర్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని ఎగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మంచు తుఫాన్లు ఇబ్బందికరంగా మారాయి. మరీ ముఖ్యంగా.. గుజ్జర్ సమాజంలోని ఒక పెద్ద సమూహానికి చెందిన ‘బకర్వాల్’ సముదాయం మంచు తుఫాన్ల కారణంగా ఎన్నో కష్టాలు పడుతున్నారు. బకర్వాల్ సముదాయానికి చెందిన వారిలో ఎక్కువ మంది గొర్రెల కాపరులే. అలా గొర్రెలు కాసేందుకు Chhut Pass ప్రాంతానికి వెళ్లి అక్కడ మంచు తుఫానులో బకర్వాల్ సముదాయానికి చెందిన ఒక కుటుంబం చిక్కుకుంది. ముగ్గురు పెద్దవారు, నలుగురు చిన్నారులు ఆ మంచు తుఫానులో చిక్కుకుని రెండు రోజులుగా అష్టకష్టాలు పడ్డారు. ఆర్మీ యూనిట్ పెట్రోలింగ్‌లో భాగంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఆ కుటుంబం కనిపించింది. వారి వెంట కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయి.



ఏం జరిగిందని ఆరా తీయగా.. మంచు తుఫాను కారణంగా చాలా గొర్రెలు చనిపోయాయని, విపరీతమైన గాలులు వీయడంతో ఏర్పాటు చేసుకున్న టెంట్ కూలిపోయిందని, తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయిందని ఆ కుటుంబం తమ దీనావస్థ గురించి ఆర్మీకి వివరించింది. ఇద్దరు పిల్లలు జ్వరంతో కూడా బాధపడుతున్నారు. మానవత్వంతో స్పందించిన జవాన్లు ఆ పిల్లలను, ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి ఆర్మీ క్యాంప్‌కు తరలించారు. వారికి అవసరమైన దుస్తులు, ఆహారం, సరుకులు ఇప్పించి వారిని స్వస్థలానికి పంపించాలని ఆర్మీ నిర్ణయించింది. ‘బకర్వాల్’ సముదాయానికి చెందిన వారు ఇలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న చాలా సందర్భాల్లో వారిని జవాన్లు రక్షించారు. స్థిర నివాసం లేకుండా, మైదానాల్లో గొర్రెలను కాస్తూ ‘బకర్వాల్’ సముదాయానికి చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

Updated Date - 2022-06-24T02:34:26+05:30 IST