Zorawar Project: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన.. చైనాకు ఇక చెక్ !

ABN , First Publish Date - 2022-08-27T23:56:23+05:30 IST

‘కుక్క తోక వంకర’ అన్న చందాన సరిహద్దులో చైనా(China) వక్రబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌కు(India) ‘సరిహద్దు సవాలు’ విసురుతూనే ఉంది.

Zorawar Project: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన.. చైనాకు ఇక చెక్ !

ఢిల్లీ : ‘కుక్క తోక వంకర’ అన్న చందాన సరిహద్దులో చైనా(China) వక్రబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌కు(India) ‘సరిహద్దు సవాలు’ విసురుతూనే ఉంది. భవిష్యత్‌లో కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే భారత ఆర్మీ(Indina)  కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దులో ఆర్మీ సామర్థ్యాల పెంపునకు వ్యూహాత్మకంగా తేలికపాటు ‘జోరావార్’(Zorawar) యుద్ధట్యాంకులు, డ్రోన్లను పెద్ద సంఖ్యలో సేకరించాలని  నిర్ణయించింది. ఇందు కోసం ‘ప్రాజెక్ట్ జోరావార్’(Project Zorawar)ను ప్రారంభించినట్టు ఆర్మీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో 350కిపైగా దేశీయ తయారీ ‘జోరావార్’ యుద్ధట్యాంకులను ఆర్మీ సమకూర్చుకోనుంది. తక్కువ బరువుండే ఈ ట్యాంకులను వాయుమార్గంతోపాటు భూతలంపై కూడా సులభంగా తరలింపునకు వీలుంటుంది. అంతేకాకుండా పర్వతప్రాంతాల్లో ఆపరేషన్లలో ఈ ట్యాంకులు సౌకర్యవంతంగా ఉంటాయి.


బరువు 25 టన్నులే..

జోరావార్ ట్యాంక్ లేదా ఏఎఫ్‌వీ-ఐఎల్‌టీ ట్యాంకుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక ప్రమాణాలను ఆర్మీ ఖరారు చేసింది. అధిక శక్తితోపాటు ట్యాంకు బరువు 25 టన్నులు మించకూడదని నిర్దేశించింది. ఫైర్‌ఫవర్ కూడా గణనీయ స్థాయిలో ఉండాలని పేర్కొంది. ఇక ఈ ట్యాంకుల్లో అధునాతన సాంకేతికతలైన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డ్రోన్ ఇంటిగ్రేషన్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, హైడిగ్రీ ఆఫ్ సిచ్యువేషనల్ అవేర్‌నెస్ ఉండాలని ఆర్మీ పేర్కొంది. కాగా ప్రాథమిక ఆమోదం కోసం ఈ ప్రమాణాలను రక్షణ మంత్రిత్వశాఖ సెప్టెంబర్‌లో పరిశీలించనుంది. 


మరోవైపు అధిక ఎత్తు, లోతట్టు ప్రాంతాల్లో నిర్దేశిత పరిధిలోని లక్ష్యాలపై దాడులకుగానూ రెండు ఇండియన్ స్టార్టప్ కంపెనీల నుంచి డ్రోన్లను సమీకరించాలని ఆర్మీ నిర్ణయించింది. ఆ తర్వాత ఏఎస్‌ఏడీ-ఎస్(అటానమస్ సర్వైలెన్స్ అండ్ ఆర్మ్‌డ్ డ్రోన్స్ స్వార్మ్) కోసం ‘మేకిన్ ఇండియా’ (Maki in India) కార్యక్రమం కింద మరిన్ని డ్రోన్లను ఆర్మీ సమీకరించనుంది.


కాగా రెండేళ్లక్రితం తూర్పు లద్ధాఖ్‌లో చైనా-భారత్ ఆర్మీల ఘర్షణ, ఆ తర్వాత ప్రతిష్ఠంభన పరిణామాన్ని ఒక పాఠంగా స్వీకరించిన ఇండియన్ ఆర్మీ ‘ప్రాజెక్ట్ జోరావార్’ను మొదలుపెట్టింది. లద్ధాఖ్ ప్రతిష్ఠంభన సమయంలో ఇరుదేశాల బలగాలు పెద్ద సంఖ్యలో ట్యాంకులు, హోవిట్జర్లు, సర్‌ఫేస్ టు ఎయిర్‌ మిసైల్ సిస్టమ్స్‌ను మోహరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-27T23:56:23+05:30 IST