శ్రీనగర్: 14 నెలల క్రితం భారత సైన్యానికి చెందిన ఒక జవానును ఉగ్రవాదులు షోపియా ప్రాంతంలో అపహరించారు. అప్పటి నుంచి జవాను ఆచూకీ తెలియక అతని తండ్రితో పాటు కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అయితే నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తండ్రి మంజూర్ అహ్మద్‌కు ఉన్నట్టుండి ఒక ఫోను వచ్చింది. కుల్గమ్లోని ఒక తోటలో ఒక మృతదేహం పడివుండని, అది మీ కుమారుడు షాకిర్ మంజూర్దే కావచ్చని అటు నుంచి తెలియజేశారు.
షాకిర్ మంజూర్ అహ్మద్... బల్పోరాలో టెరిటోరియల్ ఆర్మీ యూనిట్లో రైఫిల్ మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2020, ఆగస్టు 2న ఇంట్లో ఈద్ విందు పూర్తయిన తరువాత నుంచి అతను అదృశ్యమయ్యారు. షాకిర్ విధులు నిర్వహిస్తున్న స్థలం నుంచి ఉగ్రవాదులు అతనిని కిడ్నాప్ చేశారు. అయితే అదేరాత్రి కుల్గాం జిల్లాలోని ఒక పొలంలో ఒక మృతదేహం లభ్యమయ్యింది. అయితే అది తమ కుమారునిది కాదని మంజూర్ అహ్మద్ గుర్తించారు. అప్పటి నుంచి మంజూర్ అహ్మద్ తన కుమారుని కోసం వెదుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా వచ్చిన ఫోను ఆధారంగా మంజూర్ అహ్మద్ తన కుమారుని మృతదేహాన్ని గుర్తించారు. కాగా షాకిర్ అదృశ్యమైనప్పటి నుంచి అతని సోదరుడు షాన్ తన కాలేజీ చదువును మానివేసి, సోదరుని కోసం వెదుకులాట సాగించారు. ఈ ఉదంతంపై జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ షాకిర్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు గుర్తించారని స్ఫష్టం చేశారు.