సైన్యం దేనికైనా రెడీగానే ఉంది :చైనాకు కౌంటరిచ్చిన అమిత్‌షా

ABN , First Publish Date - 2020-10-18T14:50:14+05:30 IST

ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా, స్పందించేందుకు భారత సైన్యం ఎల్లప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.

సైన్యం దేనికైనా రెడీగానే ఉంది :చైనాకు కౌంటరిచ్చిన అమిత్‌షా

న్యూఢిల్లీ : ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా, స్పందించేందుకు భారత సైన్యం ఎల్లప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ చైనా బలగాలకు సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ ఎప్పటికీ చైనాకు ఇవ్వదు. మన సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను రక్షించే సామర్థ్యం మన జవాన్లకు, రాజకీయ నాయకత్వానికి పుష్కలంగా ఉంది. యుద్ధానికి ఏ దేశమైనా ఎప్పటికీ రెడిగానే ఉంటుంది. ఎలాంటి విపత్తు వచ్చినా... దీటుగా ప్రతిస్పందించాలన్న ఉద్దేశంతోనే ఏ దేశమైనా సైన్యాన్ని నిర్వహిస్తుంది. అయితే నేను ఈ వ్యాఖ్యలను ఎవర్నీ దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం లేదు. కానీ... భారత సైన్యం మాత్రం ఎప్పటికీ రెడీగానే ఉంటుందని మాత్రం చెప్పగలను’’ అని షా ప్రకటించారు. రెండు దేశాల మధ్య మిలటరీ అధికారి స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయని, దౌత్య మార్గాలు కూడా తెరిచే ఉన్నాయని, అయినా... ఓ హోంమంత్రిగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దేశం చాలా జాగరూకతతో ఉందని, ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉంటంకిస్తున్నట్లు షా పేర్కొన్నారు. 


నితీశే తదుపరి ముఖ్యమంత్రి : షా

 ఎన్నికల తరువాత బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా... నితీశ్ కుమారే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 2/3 వంతు సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఒకవేళ.... కానీ.... ఇలా సందిగ్ధం లేదు. నితీశ్ కుమారే తదుపరి సీఎం.  ఇప్పటికే ప్రకటించాం. దానికే కట్టుబడి ఉంటాం.’’ అని షా స్పష్టం చేశారు. గౌరవ ప్రదమైన సీట్లనే తాము ఎల్జేపీకి కేటాయిస్తామని చెప్పామని, అయినా... ఎన్డీయే వీడి చిరాగ్ వెళ్లిపోయారని, అది ఎంత మాత్రం తమ తప్పు కాదని తేల్చి చెప్పారు. ఎన్డీయే కూటమి నుంచి బయటికి వెళ్లాలన్న నిర్ణయం చిరాగే తీసుకున్నారని, తమ నిర్ణయం కాదని షా తెలిపారు.

Updated Date - 2020-10-18T14:50:14+05:30 IST