ఆ సమయంలో శానిటైజర్లు వాడకండి.. ఆర్మీ కీలక సూచన..

ABN , First Publish Date - 2020-04-04T23:09:57+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5న కొవ్వొత్తులు, దీపాలు వెలిగించే పౌరులు తగు జాగ్రత్తలు పాటించాలని...

ఆ సమయంలో శానిటైజర్లు వాడకండి.. ఆర్మీ కీలక సూచన..

 న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5న కొవ్వొత్తులు, దీపాలు వెలిగించే పౌరులు తగు జాగ్రత్తలు పాటించాలని భారత ఆర్మీ సూచించింది. దీపాలు వెలిగించే ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లకు బదులు సబ్బును ఉపయోగించాలని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ భారత ఆర్మీ ట్విటర్ ద్వారా ప్రజలకు కీలక సూచనలు చేసింది. ‘‘ఏప్రిల్ 5న కొవ్వొత్తులు, దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉందాం. దీపాలు వెలిగించే ముందు చేతులు కడుక్కునేందుకు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల బదులు సబ్బును ఉపయోగించండి..’’ అని కోరింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు ఇటీవల హ్యాండ్ శానిటైజర్లు విరివిగా వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను రాసుకుని వెంటనే దీపాలు వెలిగించడం వల్ల చేతులకు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే సబ్బును ఉపయోగించడం సురక్షితమని ఆర్మీ సూచించింది.  


దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కరోనా మహమ్మారి సృష్టించిన చీకట్లను తరిమికొట్టేందుకు ప్రజలంతా ఆదివారం రాత్రి దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సరిగ్గా 9 గంటలకు విద్యుత్ లైట్లన్నీ ఆర్పివేసి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-04-04T23:09:57+05:30 IST