హూస్టన్ పోస్టాఫీస్‌కు భారతీయుడి పేరు

ABN , First Publish Date - 2021-10-06T17:22:58+05:30 IST

అమెరికాలోని హూస్టన్‌లో 2019లో దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ అమెరికన్ పోలీస్ అధికారి సందీప్ సింగ్ ధలీవాల్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.

హూస్టన్ పోస్టాఫీస్‌కు భారతీయుడి పేరు

హూస్టన్: అమెరికాలోని హూస్టన్‌లో 2019లో దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ అమెరికన్ పోలీస్ అధికారి సందీప్ సింగ్ ధలీవాల్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. వెస్ట్ హూస్టన్‌లోని ఓ పోస్టాఫీస్‌కు ధలీవాల్ పేరు పెట్టారు. 2019 సెప్టెంబర్ 27న ధలీవాల్ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో ధలీవాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కాంగ్రెస్ సభ్యురాలు లిజీ ఫ్లేచర్ ధలీవాల్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ధలీవాల్ ప్రాణ త్యాగానికి గుర్తుగా వెస్ట్ హూస్టన్ పోస్టాఫీస్‌కు ఆయన పేరు పెడుతున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో 315 అడ్డిక్స్ హోవెల్ రోడ్‌లోని పోస్టాఫీస్ ఇకపై ధలీవాల్ పేరుతో పిలవబడనుంది. కాగా, 2015లో తొలిసారి ధలీవాల్ తలకు పాగా, గడ్డంతో పోలీస్ విధులు నిర్వహించి అమెరికాలో వార్తల్లోకి ఎక్కారు. ఇలా టెక్సాస్ డిప్యూటీ పోలీస్ అధికారిగా తలకు టర్బన్, గడ్డంతో విధులు నిర్వహించి ధలీవాల్ చరిత్ర సృష్టించారు. 


2019 సెప్టెంబర్ 27న జరిగింది ఇదీ..

దాదాపు పదేళ్ల నుంచి హారీస్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు సందీప్ సింగ్ ధలీవాల్(40). ఈ క్రమంలో 2019, సెప్టెంబర్ 27న అర్ధరాత్రి స్థానికంగా ట్రాఫిక్ విధుల్లో ఉన్నారు. విధుల్లో భాగంగా అటువైపుగా వచ్చిన ఓ కారును ఆపి తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆ కారులోంచి ఓ దుండగుడు బయటకు వచ్చి సందీప్‌పై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సందీప్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన టెక్సాస్ పోలీసులు ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2021-10-06T17:22:58+05:30 IST