70 మంది నిరసనకారులకు ఆశ్రయమిచ్చిన భారతీయుడు.. రాహుల్ గాంధీ ప్రశంసలు

ABN , First Publish Date - 2020-06-07T07:03:51+05:30 IST

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసనలు ఏ

70 మంది నిరసనకారులకు ఆశ్రయమిచ్చిన భారతీయుడు.. రాహుల్ గాంధీ ప్రశంసలు

వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసనలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలిసిందే. తెల్ల పోలీసు అధికారి చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ మరణించడంతో అమెరికా అట్టుడుకుతోంది. వేలాది మంది నిరసనకారులు రోడ్డెక్కారు. ఇదే సమయంలో పోలీసులు కూడా నిరసనకారులను చెదరగొడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల వాషింగ్టన్‌లోని ఓ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుడు 70 మంది నిరసనకారులను పోలీసుల నుంచి రక్షించారు. రాహుల్ డూబే(44) అనే ఇండియన్ అమెరికన్ తన ఇంట్లో 70 మంది నిరసనకారులకు 8 గంటల పాటు ఆశ్రయమిచ్చారు. రాహుల్ ఆశ్రయం ఇవ్వకుండా ఉంటే.. పోలీసు అధికారులు వారందరిని అరెస్ట్ చేసి ఉండేవారు. నిరసనకారుల పట్ల రాహుల్ చూపిన ప్రేమకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఫిదా అయ్యారు. ‘నీ గుండెల్లో, నీ ఇంట్లో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి చోటిచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు అనేక మంది సినిమా నటులు సైతం రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. 


ఇదిలా ఉండగా.. 70 మంది తన ఇంట్లో 8 గంటల పాటు ఉన్నా.. ఏ ఒక్కరు ఎటువంటి గొడవ చేయలేదని రాహుల్ చెప్పారు. దీని బట్టే అమెరికాలో అనేక మంది శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే ఒకేసారి అంత మంది తన ఇంట్లోకి రావడం కారణంగా.. తాను 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండనున్నట్టు రాహుల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. తాను గత 20 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత్ రాలేదని.. అయినప్పటికి భారత్ నుంచి తనపై ఈ విధంగా ప్రశంసలు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే తప్పకుండా భారతదేశానికి వస్తానన్నారు. 

Updated Date - 2020-06-07T07:03:51+05:30 IST