యూఎస్‌లో వ్యాక్సినేషన్‌‌కు భారతీయ వైద్యుల చేయూత !

ABN , First Publish Date - 2021-02-23T20:26:17+05:30 IST

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా టీకా కార్యక్రమానికి అక్కడి భారతీయ వైద్యులు తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

యూఎస్‌లో వ్యాక్సినేషన్‌‌కు భారతీయ వైద్యుల చేయూత !

న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా టీకా కార్యక్రమానికి అక్కడి భారతీయ వైద్యులు తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వేలాది మందికి టీకాలు వేయడంలో రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు వారు సహకరించనున్నారు. డా. ముఖేష్ రాయ్, డా. అవినాష్ గుప్తా నేతృత్వంలో భారత సంతతి వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, ముఖేష్ రాయ్.. ఒషియన్ కౌంటీలో ప్రజారోగ్య, సంసిద్ధత, ప్రణాళిక మరియు విద్య డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే కార్డియాలజిస్ట్ అయిన డా. అవినాష్ గుప్తా అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(ఎంఓసీఏఏపీఐ) ఒషియన్ కౌంటీ చాప్టర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరి నేతృత్వంలోనే న్యూజెర్సీ ప్రజలకు టీకాలు వేయడంలో భారత సంతతి వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. 


'అధిక జనాభా గల న్యూజెర్సీలో సకాలంలో అందరికీ టీకా అందాలంటే రాష్ట్రంలోని వైద్య సిబ్బంది ప్రతిఒక్కరూ తలో చేయి వేస్తే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వం ఒంటరిగా లక్ష్యాన్ని చేరడం కష్టం. కనుక వైద్యరంగంలోని అన్ని విభాగాలు చేయూత ఇవ్వడం ఎంతో అవసరం' అని ఒషియన్ కౌంటీ కమిషనర్ గెర్రీ లిటిల్ అన్నారు. ఇక దేశంలోనే అత్యధిక మంది వయోవృద్ధులు గల రాష్ట్రం న్యూజెర్సీ. ఈ రాష్ట్రంలో సుమారు 2 లక్షలకు పైగా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కనుక సాధ్యమైనంత త్వరగా వీరికి టీకా వేయాలంటే రాష్ట్రంలోని వైద్య సిబ్బంది సహకారం ఎంతో అవసరం. దీంతో రాష్ట్రంలోని భారతీయ వైద్యులు తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. 


ఇక ఎంఓసీఏఏపీఐలోని సుమారు 30 మంది భారత సంతతి వైద్యులు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వాలంటీర్లుగా పని చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. వీరు ఒకేరోజులో సుమారు 2వేల మందికి టీకా వేయగలరని భారతీయ వైద్యుడు కుమార్ వెల్లడించారు. ఇదిలాఉంటే.. అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం 80వేల మంది భారతీయ వైద్యులు మహమ్మారిపై పోరులో తమవంతు సాయం చేస్తున్నట్లు సమాచారం. అలాగే మరో 40వేల మంది వైద్య విద్యార్థులు, నివాసితులు, ఇతర వైద్య సిబ్బంది దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా బారిన పడ్డ వారికి సహాయం చేస్తున్నారని ఎంఓసీఏఏపీఐ తెలియజేసింది.            


Updated Date - 2021-02-23T20:26:17+05:30 IST