భారతీయ అమెరికన్ వైద్యుల ఉదారత !

ABN , First Publish Date - 2021-05-08T19:13:54+05:30 IST

కరోనాతో అతలాకుతలం అవుతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా నుంచి సాయం కొనసాగుతోంది.

భారతీయ అమెరికన్ వైద్యుల ఉదారత !

వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలం అవుతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా నుంచి సాయం కొనసాగుతోంది. జో బైడెన్ ప్రభుత్వంతో పాటు అక్కడి భారతీయ అమెరికన్లు భారీ మొత్తంలో భారత్‌కు సాయం అందిస్తున్నారు. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజిషియన్స్ అసోసియేషన్ (ఎఫ్ఐపీఏ) అనే భారతీయ అమెరికన్ వైద్యుల యూనియన్ 5వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మాతృదేశానికి పంపిస్తున్నట్లు ప్రకటించింది. ఈ 5వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇప్పటికే కొనుగోలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. వీటిలో ఇప్పటికే 450 అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. మరో 325 ఢిల్లీకి, 300 ముంబైకి పంపించినట్లు పేర్కొంది.


మిగిలిన 3,500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌లోని వివిధ నగరాలకు చేరవేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎఫ్ఐపీఏ అధ్యక్షుడు రాజ్ భయానీ తెలిపారు. ఇండియాలోని స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఇక్కడి ఆస్పత్రులు, ఐసోలేషన్ సెంటర్లు, కొత్తగా ఏర్పడిన మొబైల్ ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థలకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేస్తున్నట్లు ఎఫ్ఐపీఏ వెల్లడించింది. ఇదిలాఉంటే.. భారత్‌కు సాయం చేసేందుకు ఇప్పటికే యూఎస్‌లోని భారతీయ అమెరికన్ సంస్థలైన.. సేవా ఇంటర్నెషనల్ యూఎస్ఏ 10 మిలియన్ల డాలర్లు, ఏఏపీఐ(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) 3.5 మిలియన్ డాలర్లు, ఇండియాస్పోరా 2 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించినట్లు తెలుస్తోంది.         


Updated Date - 2021-05-08T19:13:54+05:30 IST