Parental kidnapping: అమెరికాలో మహిళతో NRI సహజీవనం.. బిడ్డ పుట్టాక పక్కా స్కెచ్ వేసి..

ABN , First Publish Date - 2022-07-27T00:15:39+05:30 IST

కన్నబిడ్డను కిడ్నాప్ చేశాడంటూ ఓ ఎన్నారైపై దాఖలైన కేసులో అమెరికా న్యాయస్థానం ఇటీవల నిందితుడిని దోషిగా తేల్చింది. అతడికి త్వరలో మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వడోదరకు చెందిన అమిత్‌కుమార్ కానూభాయ్ పటేల్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. అక్కడ ఉండే ఓ మహిళతో సహజీవనం చేశారు. అయితే..

Parental kidnapping: అమెరికాలో మహిళతో NRI సహజీవనం.. బిడ్డ పుట్టాక పక్కా స్కెచ్ వేసి..

ఎన్నారై డెస్క్: కన్నబిడ్డను కిడ్నాప్ చేశాడంటూ (International Parental Kidnapping) ఓ ఎన్నారైపై(NRI) దాఖలైన కేసులో అమెరికా న్యాయస్థానం ఇటీవల నిందితుడిని దోషిగా తేల్చింది. అతడికి త్వరలో మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన అమిత్‌కుమార్ కానూభాయ్ పటేల్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయన గతంలో న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో నివసించేవారు. అక్కడ ఉండే ఓ మహిళతో సహజీవనం చేశారు. 2015 ఆగస్టు నుంచి 2017 జూలై వరకూ ఆ జంట ఒకే ఇంట్లో నివాసం ఉండేది. 2016 నవంబర్‌లో వారికి సంతానం కలిగింది. అయితే.. ఆ జంట మాత్రం వివాహం చేసుకోలేదు. ఈ క్రమంలో ఓ రోజు అమిత్.. బిడ్డను భారత్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులకు పరిచయం చేయాలనుకుంటున్నట్టు ఆమెకు చెప్పాడు. అంతేకాకుండా.. తన పూర్వీకుల ఆస్తి తన కొడుక్కు రావాలంటే బిడ్డకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలని కూడా చెప్పుకొచ్చాడు. ఇక చిన్నారికి ఇండియా వీసా రావాలంటే.. బిడ్డ పూర్తి బాధ్యతలు తనకే అప్పగించాలని ఆమెను కోరాడు.  


అయితే.. చిన్నారి బాధ్యత తనకు దక్కే అవకాశం కోర్టు ద్వారా మాత్రమే ఉండటంతో అమిత్ 2017 మే నెలలో న్యూజెర్సీలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తామిద్దరి పరస్పర అంగీకారం మేరకే బిడ్డ కస్టడీని తనకు అప్పగిస్తున్నట్టు అమిత్.. బిడ్డ తల్లితో కొర్టులో చెప్పించారు. తనకు వర్క్‌పర్మిట్ లేని కారణంగా ఉద్యోగం లేదని, బిడ్డను భరించే స్థితిలో లేనని ఆమె.. అమిత్ సూచనల ప్రకారం కోర్టుకు తెలిపారు. చివరకు.. అమిత్ కోరుకున్నట్టుగానే బిడ్డ పూర్తి కస్టడీ ఆయనకు దక్కింది. ఆ తరువాత.. చిన్నారిని ఇండియాకు తీసుకెళుతున్నానని అమిత్.. బిడ్డ తల్లితో చెప్పి ఇండియాకు వచ్చేశారు. అనంతరం.. ఓ రోజు ఆమెకు ఫోన్ చేసి చిన్నారిని ఇక ఎప్పటికీ అమెరికాకు తీసుకురానంటూ తేల్చి చెప్పారు. 


దీంతో.. బాధిత మహిళ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. బిడ్డను తక్షణం తల్లికి అప్పగించాలంటూ కోర్టు 2018 అక్టోబర్‌లో  అమిత్‌కు ఆదేశాలు జారీ చేసింది. మహిళ తరపు లాయర్.. ఈ ఆదేశాలను అమిత్‌కు ఈ మెయిల్ చేయగా ఆయన పట్టించుకోలేదు. ఇక 2020 అక్టోబర్‌లో ఆయన బిడ్డతో సహా బ్రిటన్‌కు వెళ్లారు. అమిత్‌ను అరెస్టు చేయాలంటూ అప్పటికే బ్రిటన్ అధికారులకు అమెరికా కోర్టు నుంచి ఆదేశాలు అందటంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బిడ్డ కస్టడీకి సంబంధించి లండన్‌లో హేగ్ నిబంధనలను అనుసరించి విచారణ జరగ్గా.. చిన్నారి బాధ్యతను ఇండియాలో ఉంటున్న తాతయ్య నాన్నమ్మలకు అప్పగించడమే ఉచితమని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. చిన్నారి ప్రయోజనాల దృష్ట్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు గతేడాది సెప్టెంబర్‌లో అమిత్‌ను అమెరికాకు తరలించగా.. స్థానిక న్యాయస్థానం విచారణ జరిపింది. కన్నబిడ్డను కిడ్నాప్ చేశాడన్న కేసులో అమిత్‌ను దోషిగా తేలుస్తూ ఇటీవలే తీర్పు ఇచ్చింది. నవంబర్‌లో అతడికి శిక్ష ఖరారయ్యే అవకాశం ఉందని, అమిత్‌కు అత్యధికంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటూ 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2022-07-27T00:15:39+05:30 IST