'ట్రంప్ హై తో సేఫ్ హై' అంటున్న ప్రవాస భారతీయుడు !

ABN , First Publish Date - 2020-10-11T16:37:51+05:30 IST

రిపబ్లికన్ పార్టీ మద్దతుదారు, ఇండియన్-అమెరికన్ పారిశ్రామికవేత్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని అయిన డానీ గైక్వాడ్ 'ట్రంప్ హై తో సేఫ్ హై'(ట్రంప్ ఉంటే క్షేమంగా ఉన్నట్లే) అనే నినాదంతో ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం ఓ ప్రత్యేక ఉద్యమానికి తెరలేపారు.

'ట్రంప్ హై తో సేఫ్ హై' అంటున్న ప్రవాస భారతీయుడు !

వాషింగ్టన్ డీసీ: రిపబ్లికన్ పార్టీ మద్దతుదారు, ఇండియన్-అమెరికన్ పారిశ్రామికవేత్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని అయిన డానీ గైక్వాడ్ 'ట్రంప్ హై తో సేఫ్ హై'(ట్రంప్ ఉంటే క్షేమంగా ఉన్నట్లే) అనే నినాదంతో ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం ఓ ప్రత్యేక ఉద్యమానికి తెరలేపారు. ఈ ఉద్యమం ద్వారా ఇండియాకు ట్రంప్ చేసిన మేలును హైలైట్ చేయడమే తమ లక్ష్యమని డానీ అన్నారు. "ఈ అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్ గాయపడ్డారు. అందుకే నా సొంత డబ్బులతో ఆయనకు మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాను." అని ఫ్లోరిడాకు చెందిన ఈ పారిశ్రామిక వేత్త గురువారం ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. 


"కొన్ని నెలల క్రితం నేను వ్యక్తిగతంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కలిశాను. అగ్రరాజ్యాన్ని నడిపించేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టేందుకు ట్రంపే సరియైన వ్యక్తి అని నమ్ముతున్నాను. దేశంలో హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉన్న పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, మిచిగాన్, ఒహియో రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకం కానున్నాయి. ఫస్ట్ జనరేషన్(మొదటి తరం) ఓటర్లను చేరడానికి ఇండియన్ టీవీ ఛానల్స్ కీలక పాత్ర పోషిస్తాయని నా అభిప్రాయం." అని గుజరాత్ రాష్ట్రం బరోడాకు చెందిన డానీ అన్నారు. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరున ఉన్న "మోదీ హై తో ముమ్‌కిన్ హై" అనే నినాదం ఆధారంగానే తన ఉద్యమానికి  'ట్రంప్ హై తో సేఫ్ హై' అనే పేరును ఎంచుకున్నట్లు తెలిపారు. 


అలాగే గత ఎన్నికల్లో మోదీ ఉపయోగించిన మరో నినాదం "ఏక్ బార్ ఔర్ మోదీ సర్కార్"ను ఆదర్శంగా తీసుకుని "ఏక్ బార్ ఔర్ ట్రంప్ సర్కార్" అనే నినాదంతో టెలివిజన్ యాడ్స్‌ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు డానీ పేర్కొన్నారు. ట్రంప్‌ను ఎందుకు ఎన్నుకోవాలనే ప్రశ్నకు సమాధానంగా... ఆయన భారత్‌కు మంచి మిత్రుడు.. ఈ విషయాన్ని ఇప్పటికే ట్రంప్ నిరూపించుకున్నారని డానీ ఈ టీవీ యాడ్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, సెనేటర్ రిక్ స్కాట్, మాజీ వ్యవసాయ కమిషనర్ ఆడమ్ పుట్నం సహా పార్టీలోని అగ్రశ్రేణి నాయకుల కోసం ఫండ్ రైజింగ్‌లో అతిపెద్ద భారతీయ అమెరికన్ రిపబ్లికన్ దాతలలో డానీ గైక్వాడ్ ఒకరు. 

Updated Date - 2020-10-11T16:37:51+05:30 IST