లోకాస్ట్ వెంటిలేట‌ర్‌ను ఆవిష్క‌రించిన భార‌త సంత‌తి జంట‌.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-05-26T17:01:27+05:30 IST

అమెరికాలో ఓ భారత సంత‌తి జంట తక్కువ ఖర్చుతో అత్యవసర పోర్టబుల్ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది.

లోకాస్ట్ వెంటిలేట‌ర్‌ను ఆవిష్క‌రించిన భార‌త సంత‌తి జంట‌.. అమెరికాలో..

వాషింగ్ట‌న్ డీసీ: అమెరికాలో ఓ భారత సంత‌తి జంట తక్కువ ఖర్చుతో అత్యవసర పోర్టబుల్ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. త్వ‌ర‌లోనే ఈ లోకాస్ట్ వెంటిలేట‌ర్ ఉత్ప‌త్తిని ప్రారంభించ‌నున్నారు. అమెరికాతో పాటు ఇండియాలో కూడా ఈ వెంటిలేట‌ర్ అందుబాటులోకి రానుంది. దీంతో త‌క్కువ ఖ‌ర్చుతో కోవిడ్‌-19 బాధితుల‌కు చికిత్స అందించ‌డంలో వైద్యుల‌కు ఈ వెంటిలేట‌ర్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృంభిస్తున్న‌ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా చాలా దేశాల్లో వెంటిలేట‌ర్ల కొర‌త ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే.


ఇక ప్ర‌స్తుతం వినియోగంలో ఉన్న వెంటిలేట‌ర్ల ఖ‌రీదు అధికంగా ఉండ‌డంతో పాటు డిమాండ్‌కు త‌గ్గ ఉత్ప‌త్తి జ‌ర‌గ‌డం లేదు. ఇలా క‌రోనా సంక్షోభం వేళ వెంటిలేట‌ర్ల కొర‌త‌తో కోవిడ్ రోగులు మ‌ర‌ణించ‌డం గ్ర‌హించిన భార‌త సంత‌తి దంప‌తులు దేవేష్ రంజ‌న్‌, కుముడా రంజ‌న్ త‌క్కువ ఖ‌ర్చుతో వెంటిలేటర్లు అభివృద్ధికి పూనుకున్నారు. అనుకున్న‌ట్టే కేవ‌లం మూడు వారాల వ్య‌వ‌ధిలోనే అతి త‌క్కువ ఖ‌ర్చుతో భార‌తీయ‌ జంట ఈ అత్యవసర పోర్టబుల్ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేశారు. 


దీని నిర్మాణానికి కేవ‌లం 100 డాల‌ర్లు(7,568) మాత్ర‌మే ఖ‌ర్చు అయిన‌ట్లు దేవేష్ రంజ‌న్ తెలిపారు. ఇక తయారీదారులు మార్కెట్‌లో ఈ వెంటిలేట‌ర్‌ను 500 డాల‌ర్లకు విక్రయించిన వారికి లాభం వ‌స్తుంది త‌ప్పా.. ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇలాంటి వెంటిలేట‌ర్లు ప్ర‌స్తుతం అమెరికన్ మార్కెట్స్‌లో ప‌దివేల డాల‌ర్ల‌కు(రూ. 7.56ల‌క్ష‌లు) దొర‌కుతున్నాయ‌ని, దీనిపై చూస్తే తాము రూపొందించిన ఈ పోర్టబుల్ వెంటిలేట‌ర్ ఎంతో చ‌వ‌క అని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల‌కు చికిత్స చేయ‌డంలో ఇది వైద్యులకు ఎంతో ఉప‌యోగ‌క‌రంగాను ఉంటుంద‌ని రంజ‌న్ దంప‌తులు వెల్ల‌డించారు. 


ఇక ఈ భార‌తీయ దంప‌తులు బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన వారు. దేవేష్ రంజ‌న్ ప్ర‌స్తుతం జార్జియా టెక్ జార్జ్ డబ్ల్యూ వుడ్రఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థ‌లో ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తుంటే... కుముడా రంజ‌న్ అట్లాంటాలో వైద్యురాలి(ఫ్యామిలీ ఫీజిషియ‌న్‌)గా ప‌ని చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అగ్ర‌రాజ్యంలో తీవ్ర రూపం దాల్చిన మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 99వేల‌కు పైగా మందిని పొట్ట‌న‌బెట్ట‌కుంది. 17 లక్ష‌ల మంది బాధితులు ఉన్నారు. అటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కోవిడ్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కూ 3.47 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించగా, 55.90 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోకింది. ఇటు భారత్‌లో కూడా క‌రోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే 1.45 లక్ష‌ల మందికి ప్ర‌బ‌లిన ఈ మ‌హ‌మ్మారి 4వేల‌కు పైగా మందిని క‌బ‌ళించింది.     

Updated Date - 2020-05-26T17:01:27+05:30 IST