వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో భారత సంతతి వ్యక్తి

ABN , First Publish Date - 2020-09-29T20:45:29+05:30 IST

భారత సంతతికి చెందిన పునీత్ అహ్లువాలియా(55) అనే వ్యాపారవేత్త అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవి రేసులో ఉన్నారు.

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో భారత సంతతి వ్యక్తి

వాషింగ్టన్ డీసీ: భారత సంతతికి చెందిన పునీత్ అహ్లువాలియా(55) అనే వ్యాపారవేత్త అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవి రేసులో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన "హోప్, గ్రోత్, ఆపర్చునిటీ" అనే నినాదంతో ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ... "ప్రస్తుతం వర్జీనియా రాష్ట్రం సమస్యల్లో ఉంది. ఇక డెమొక్రటిక్ పార్టీ ఇస్తున్న పాత, వ్యర్థమైన వాగ్దానాలకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పడు మన రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఆలోచనలు కావాలి. అందుకే వర్జీనియాలోని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సంఘానికి 'హోప్, గ్రోత్, ఆపర్చునిటీ' అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నాం. దీనిని తాము తప్పకుండా పాటిస్తాం" అని అన్నారు.


ఢిల్లీలో పుట్టిన పునీత్ అహ్లువాలియా 1990లో అమెరికాకు వలస వెళ్లారు. అతని భార్య నదియాది ఆఫ్గనిస్థాన్. "మేము అమెరికాలో జన్మించలేదు. కానీ నేను, నా భార్య ఇష్టపూర్వకంగా అమెరికా పౌరసత్వం తీసుకున్నాం. నేను రాజకీయ వేత్తను కాదు. కానీ, అమెరికన్ స్వప్నాన్ని సాకారం చేసుకున్న అమెరికన్ పౌరుడిగా నేను ఎంతో గర్విస్తున్నాను " అని చెప్పుకొచ్చారు. 


"అమెరికాలోని వర్జీనియాకు 30 ఏళ్ల క్రితం వచ్చాను. నా మొదటి ఉద్యోగం రిటైల్ దుకాణాలకు ఎలక్ట్రానిక్స్ పంపిణీ చేయడం. ఇలా కెరీర్‌ను ప్రారంభించిన నేను ఆ తర్వాత నెమ్మదిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి వచ్చాను. ఇవాళ నేను 'ద లివింగ్‌స్టన్ గ్రూపు' సంస్థకు అంతర్జాతీయ వాణిజ్య సలహాదారుగా ఉన్నాను" అని తెలిపారు.     

Updated Date - 2020-09-29T20:45:29+05:30 IST