తొలి టీ20లో ఆసీస్‌కు షాక్.. బోణీ కొట్టిన టీమిండియా

ABN , First Publish Date - 2020-12-04T23:11:04+05:30 IST

కాన్‌బెర్రా వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. బౌలర్లు అద్భుతంగా...

తొలి టీ20లో ఆసీస్‌కు షాక్.. బోణీ కొట్టిన టీమిండియా

కాన్‌బెర్రా వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. టీమిండియా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించినప్పటికీ మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. డి ఆర్కీ షార్ట్ 34 పరుగులు, ఫించ్ 35 పరుగులు చేశారు. అయితే.. నటరాజన్ బౌలింగ్‌లో డి ఆర్కీ షార్ట్ షాట్‌కు యత్నించి హార్థిక్ పాండ్యాకు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. చాహల్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన ఫించ్ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హార్థిక్ పాండ్యాకు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. స్మిత్ 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చాహల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ 2 పరుగులకే నటరాజన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.హెన్రిక్స్ 30 పరుగులతో ఆసీస్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ చాహర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగక తప్పలేదు. దీంతో.. ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.


తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ధావన్ ఒక్క పరుగుకే స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా ఔట్ కావడం షాకిచ్చినప్పటికీ.. కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 51 పరుగులతో రాణించడం ఊరటనిచ్చింది. కోహ్లీ 9 పరుగులు, సంజూ శాంసన్ 23, మనీష్ పాండే 2, హార్థిక్ పాండ్యా 16 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 23 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అద్భుతంగా రాణించడంతో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హెన్రిక్స్ 3 వికెట్లతో రాణించగా, స్కార్క్‌కు 2 వికెట్లు, స్వెప్‌సన్, జంపాకు తలో వికెట్ దక్కింది. టీమిండియా బౌలర్లలో నటరాజన్‌కు 3 వికెట్లు, చాహల్‌కు 3 వికెట్లు, దీపక్ చాహర్‌కు ఒక వికెట్ దక్కింది.

Updated Date - 2020-12-04T23:11:04+05:30 IST