దంబుల్లా: శ్రీలంక మహిళల జట్టుతో ఇక్కడ జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని భారత మహిళల (India Women) జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 126 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 5 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ 31 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ, సాబినేని మేఘన చెరో 17 పరుగులు చేయగా, యస్తికా భాటియా 13 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ఒషాడి రణసింఘే, ఇనోక రణవీర చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నె(45), కెప్టెన్ అటపట్టు (43) మినహా జట్టులో ఎవరూ రాణించలేకపోయారు. పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసుకోగా, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్ కౌర్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. చివరి టీ20 ఈ నెల 27న జరగనుంది.
ఇవి కూడా చదవండి