Smriti Mandhana: ఉత్కంఠపోరులో ఇండియాదే గెలుపు.. ఫైనల్స్‌కు టీమిండియా

ABN , First Publish Date - 2022-08-07T00:37:55+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన

Smriti Mandhana: ఉత్కంఠపోరులో ఇండియాదే గెలుపు.. ఫైనల్స్‌కు టీమిండియా

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా అమ్మాయిలు ఫైనల్స్‌లో అడుగుపెట్టి పతకం ఖాయం చేశారు. తొలుత బ్యాటింగ్‌లో ఇరగదీసిన హర్మన్‌ప్రీత్ సేన ఆ తర్వాత బౌలింగులోనూ ప్రతాపం చూపి ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. తొలుత స్మృతి మంధాన దూకుడుతో 164 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను 160 పరుగులకే కట్టడి చేసి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం పలుమార్లు చేతులు మారినప్పటికీ చివరికి టీమిండియాదే పై చేయి అయింది. వరుస రనౌట్లు ఇంగ్లండ్ కొంప ముంచాయి.


భారత్ నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభం కలిసిరాలేదు. 28 పరుగుల వద్ద ఓపెనర్ సోఫియా డంక్లీ (19) అవుటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అలీస్ కేప్సీతో కలిసి డేనియల్ వైట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజానికెత్తుకుంది. అయితే, 13 పరుగులు మాత్రమే చేసిన అలీస్ రనౌట్‌గా వెనుదిరగడంతో తిరిగి కష్టాల్లో కూరుకుపోయినట్టు కనిపించింది. కెప్టెన్ నటాలియా స్కివర్ రాకతో మళ్లీ బలం పుంజుకున్నఇంగ్లండ్ విజయం వైపుగా దూసుకెళ్తున్నట్టు కనిపించింది. ఈ క్రమంలో క్రీజులో పాతుకుపోయిన డేనియల్ వైట్‌ (35)ను స్నేహ్ రాణా బౌల్డ్ చేయడంతో 81 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. నాటాలీ స్కివర్ (41), అమీ జోన్స్(31) కలిసి భారత శిబిరాన్ని కాసేపు ఆందోళనలోకి నెట్టేశారు.


ఈ క్రమంలో మరింత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్లు వారిని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. వీరిద్దరూ రనౌట్ అయ్యాక కూడా మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ వీడలేదు.


చివరి ఓవర్‌కు ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి బ్రంట్‌ అవుట్ కావడంతో మ్యాచ్ భారత చేతుల్లోకి వచ్చినట్టే కనిపించింది. నాలుగో బంతికి ఒక్క పరుగు వచ్చింది. ఇక చివరి రెండు బంతులకు 12 పరుగులు అవసరం కాగా, ఒక్క పరుగు మాత్రమే లభించింది. దీంతో భారత్ విజయం ఖాయమైపోయింది. అయితే, చివరి బంతిని ఎక్లెస్టోన్ సిక్సర్‌గా మలచడంతో భారత్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. అమ్మాయిలు ఆనందంతో పరుగులు తీశారు.  


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్ నిర్ణయం సరైనదేనని ఓపెనర్ స్మృతి మంధాన నిరూపించింది. క్రీజులోకి అడుగుపెడుతూనే వీరవిహారం చేసింది. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ బంతిని నలువైపులా బాదింది. ఆమె దెబ్బకు ఇంగ్లండ్ బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. బౌండరీలు దాటుతున్న బంతులను తెచ్చి ఇచ్చేందుకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది.


క్రీజులో పాతుకుపోయిన మంధాన, షెఫాలీ వర్మ జోడీని విడగొట్టేందుకు మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి 76 పరుగుల వద్ద షెఫాలీ వర్మ (15) అవుటైంది. ఫ్రెయా కెంప్ బౌలింగ్‌లో బ్రంట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. మంధాన దూకుడుగా ఆడుతుంటే ఆమెకు అండగా నిలిచిన షెఫాలీ అవుటైన తర్వాత మరొక్క పరుగు జోడించాక స్మృతి మంధాన కూడా అవుటైంది. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న మంధాన 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది. మంధాన వేసిన పునాది కూలిపోకుండా జెమీమా రోడ్రిగ్స్ కాపాడింది. 31 బంతులు ఆడిన జెమీమా 7 ఫోర్లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

Updated Date - 2022-08-07T00:37:55+05:30 IST