ఆఖరి పంచ్‌ అదుర్స్‌

ABN , First Publish Date - 2021-03-21T09:47:44+05:30 IST

సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌ను కోహ్లీసేన ఘనంగా ముగించింది. టీ20ల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో భారత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరు సాధించింది...

ఆఖరి పంచ్‌ అదుర్స్‌

  • చివరి టీ20లో భారత్‌ విజయం 
  • 3-2తో సిరీస్‌ కైవసం 
  • కోహ్లీ, రోహిత్‌  విజృంభణ
  • మలాన్‌, బట్లర్‌ పోరాటం

రోహిత్‌ స్ట్రెయిట్‌ డ్రైవ్స్‌.. సూర్యకుమార్‌ 360 డిగ్రీ షాట్స్‌.. విరాట్‌ కోహ్లీ క్లాసిక్‌ కవర్‌ డ్రైవ్స్‌. ఇలా ఆఖరి మ్యాచ్‌లో అభిమానులకు కావాల్సినంత వినోదం.. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా మొతేరాలో బౌండరీల మోత మోగించారు. తొలిసారి ఓపెనింగ్‌ జోడీ కట్టిన రోహిత్‌-కోహ్లీ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చి విజయానికి బాటలు వేశారు. అయితే ఛేదనలో మలాన్‌, బట్లర్‌ భారీ షాట్లతో భారత్‌ను వణికించినా.. భువీ పొదుపైన బౌలింగ్‌, చివర్లో శార్దూల్‌ మెరుపులతో టీమిండియా ఈ సిరీస్‌ను దక్కించుకుంది.


అహ్మదాబాద్‌: సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌ను కోహ్లీసేన ఘనంగా ముగించింది. టీ20ల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో భారత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరు సాధించింది. విరాట్‌ కోహ్లీ (52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 నాటౌట్‌), రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64) అర్ధసెంచరీలతో విజృంభించారు. ఆ తర్వాత భువనేశ్వర్‌ (2/15), శార్దూల్‌ (3/45) పదునైన బంతులతో కట్టడి చేయగా భారత్‌ 36 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 3-2తో సిరీస్‌ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (32), హార్దిక్‌ పాండ్యా (39 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసి ఓడింది. డేవిడ్‌ మలాన్‌ (46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), బట్లర్‌ (34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) విజయం కోసం పోరాడినా ఫలితం లేకపోయింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు భువనేశ్వర్‌కు దక్కగా.. విరాట్‌ కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీ్‌సగా నిలిచాడు.


చివర్లో తడబాటు: ఇంగ్లండ్‌ భారీ ఛేదనలో పేసర్‌ భువనేశ్వర్‌ తొలి బంతికే ఓపెనర్‌ రాయ్‌ వికెట్‌ను తీశాడు. అయినా ఒత్తిడికి గురి కాకుండా ఆ జట్టు అద్భుత రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. అయితే చివరి ఐదు ఓవర్లలో ఒక్కసారిగా డీలా పడింది. సిరీ్‌సలో తొలిసారిగా డేవిడ్‌ మలాన్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. రెండో ఓవర్‌లోనే 4,6,4తో 18 పరుగులు అందించాడు. అతడికి జతగా మరో ఓపెనర్‌ బట్లర్‌ కూడా అదే జోరు చూపిస్తూ వరుస బౌండరీలతో చెలరేగగా పవర్‌ప్లేలో జట్టు 62 పరుగులు సాధించింది. ఆ తర్వాత చాహర్‌ ఓవర్‌లో బట్లర్‌ రెండు సిక్సర్లు బాదగా.. అటు మలాన్‌ సైతం నటరాజన్‌ ఓవర్‌లో 4,6,4తో చెలరేగడంతో భారత శిబిరంలో ఆందోళన కనిపించింది. ఈ దశలో భువీ.. బట్లర్‌ వికెట్‌ తీసి ఈ ప్రమాదకర జోడీని విడదీశాడు. రెండో వికెట్‌కు వీరు 130 రన్స్‌ అందించారు. 15వ ఓవర్‌లో శార్దూల్‌.. బెయిర్‌స్టో (7), మలాన్‌ వికెట్లను తీయడంతో ఇంగ్లండ్‌ ఆశలు వదిలేసుకుంది. 




బాదుడే బాదుడు: ఈ సిరీ్‌సలో నాలుగోసారి భారత ఓపెనింగ్‌ జోడీ మారింది. ఈసారి రోహిత్‌కు జతగా   కెప్టెన్‌ కోహ్లీ బరిలోకి దిగాడు. ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే చెలరేగారు. వీరి శుభారంభంతో చివరి వరకు జట్టు స్కోరు 10కి పైగా రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. ముఖ్యంగా రోహిత్‌ అయితే మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్లు బాదేస్తూ ఇంగ్లండ్‌ శిబిరంలో గుబులు రేపాడు. నాలుగో ఓవర్‌లో మార్క్‌ వుడ్‌ 150 కి.మీ వేగంతో విసిరిన రెండు బంతులను అంతే వేగంతో ఫోర్లుగా మలిచిన తీరు సూపర్‌. ఇక ఆరో ఓవర్‌లో కోహ్లీ హుక్‌, రోహిత్‌ పుల్‌ షాట్లతో సాధించిన సిక్సర్లు అదుర్స్‌ అనిపించాయి. దీంతో పవర్‌ప్లేలో భారత్‌ 60 పరుగులు చేసింది. ఆ తర్వాత రోహిత్‌ మరో సిక్సర్‌తో 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇక స్టోక్స్‌ ఓవర్‌లో వరుసగా 6,4 సాధించినా.. అదే ఓవర్‌లో రోహిత్‌ బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికే తొలి వికెట్‌కు 9 ఓవర్లలో 94 రన్స్‌ జత చేరడం విశేషం. ఇక సూర్యకుమార్‌ వచ్చీ రాగానే రెండు సిక్సర్లతో 16 పరుగులు రాబట్టాడు. ఈ ఆటతీరుతో తొలి 10 ఓవర్లలో జట్టు స్కోరు 110కి చేరింది. 12వ ఓవర్‌లోనైతే హ్యాట్రిక్‌ సహా నాలుగు ఫోర్లతో సూర్య 19 రన్స్‌ సాధించాడు. ఈ దశలో జోర్డాన్‌ అద్భుత ప్రయత్నంతో ఇంగ్లండ్‌కు సూర్య వికెట్‌ లభించింది. లాంగాన్‌లో సిక్స్‌గా వెళ్లే బంతిని అందుకున్న జోర్డాన్‌ మెరుపు వేగంతో రాయ్‌ వైపు విసిరి లైన్‌ దాటాడు. మరోవైపు ఓపిగ్గా ఆడిన కోహ్లీ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక హార్దిక్‌ 18వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదగా 30 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో కోహ్లీ రెండు ఫోర్లతో ఇంగ్లండ్‌పై భారత్‌ అత్యధిక స్కోరు సాధించింది. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ మంగళవారం పుణెలో జరగనుంది.


స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (బి) స్టోక్స్‌ 64; కోహ్లీ (నాటౌట్‌) 80; సూర్యకుమార్‌ (సి) రాయ్‌ (బి) రషీద్‌ 32; పాండ్యా (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 224/2. వికెట్ల పతనం: 1-94, 2-143; బౌలింగ్‌: రషీద్‌ 4-0-31-1; ఆర్చర్‌ 4-0-43-0; వుడ్‌ 4-0-53-0; జోర్డాన్‌ 4-0-57-0; సామ్‌ కర్రాన్‌ 1-0-11-0; బెన్‌ స్టోక్స్‌ 3-0-26-1.

ఇంగ్లండ్‌: జేసన్‌ రాయ్‌ (బి) భువనేశ్వర్‌ 0; బట్లర్‌ (సి) హార్దిక్‌ (బి) భువనేశ్వర్‌ 52; మలాన్‌ (బి) శార్దూల్‌ 68; బెయిర్‌స్టో (సి) సూర్యకుమార్‌ (బి) శార్దూల్‌ 7; మోర్గాన్‌ (సి సబ్‌) రాహుల్‌ (బి) హార్దిక్‌ 1; బెన్‌ స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) నటరాజన్‌ 14; జోర్డాన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) శార్దూల్‌ 11; ఆర్చర్‌ (రనౌట్‌) 1; సామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 14; రషీద్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 20 ఓవర్లలో 188/8; వికెట్ల పతనం: 1-0, 2-130, 3-140, 4-142, 5-142, 6-165, 7-168, 8-174; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-15-2; హార్దిక్‌ పాండ్యా 4-0-34-1; వాషింగ్టన్‌ సుందర్‌ 1-0-13-0; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-45-3; నటరాజన్‌ 4-0-39-1; రాహుల్‌ చాహర్‌ 3-0-33-0.


1

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (1502) చేసిన కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ. సారథిగా ఎక్కువ అర్ధసెంచరీ (12)లు, ద్వైపాక్షిక టీ20 సిరీ్‌సలో ఎక్కువ పరుగులు (231) చేసిన ఆటగాడిగానూ కోహ్లీ నిలిచాడు.


ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో ఎక్కువ పరుగులు  (198) సమర్పించుకున్న బౌలర్‌గా జోర్డాన్‌.


అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా (24 ఇన్నింగ్స్‌) వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌ డేవిడ్‌ మలాన్‌. బాబర్‌ ఆజమ్‌ (26 ఇన్నింగ్స్‌) రెండోస్థానంలో ఉన్నాడు.


Updated Date - 2021-03-21T09:47:44+05:30 IST