సాగర తీరంలో పంత్ బ్యాట్ ఝళిపించకుంటే కష్టమే!

ABN , First Publish Date - 2022-06-15T00:11:40+05:30 IST

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది

సాగర తీరంలో పంత్ బ్యాట్ ఝళిపించకుంటే కష్టమే!

విశాఖపట్టణం: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. వైజాగ్‌ ఇందుకు వేదిక అవుతోంది. తొలి రెండుమ్యాచుల్లోనూ వరుస పరాజయాలు చవిచూసిన పంత్ సేనకు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. కాబట్టి నేటి మ్యాచ్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనన్న ఉత్కంఠ అభిమానులను కలవర పెడుతోంది. ఈ సిరీస్‌లో సఫారీలు పూర్తిస్థాయి జట్టుతో ఆడుతుండగా టీమిండియా మాత్రం కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమీ లేకుండానే ఆడుతోంది. వీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.  గాయంతో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ దూరమవడం కూడా జట్టుపై ప్రభావం చూపిస్తోంది.  


టీమిండియా ఆటగాళ్లలో కొందరు కనుక రాణిస్తే నేటి మ్యాచ్‌లో భారత్‌కు విజయం నల్లేరుమీద నడకే అవుతుంది. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ ఫామ్‌లోనే ఉన్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 55 సగటుతో 110 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో భారత్ తరపున హాఫ్ సెంచరీ చేసిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. నేటి మ్యాచ్‌లోనూ ఇషాన్ చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


మిడిలార్డర్‌లో శ్రేయాస్ కూడా కీలకమే. అయితే ఈ యువ ప్లేయర్ సిరీస్‌లో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. జట్టులో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో శ్రేయాస్ తప్పకుండా నిరూపించుకోవాల్సిన మ్యాచ్ ఇది. ఇక, కెప్టెన్ పంత్ కూడా అంచనాలను అందుకోలేక చతికిలపడుతున్నాడు. నేటి మ్యాచ్‌లో అతడు బ్యాట్ ఝళిపిస్తే తప్ప వెల్లువెత్తుతున్న విమర్శలకు ఫుల్‌స్టాప్ పడదు. 


ఐపీఎల్‌లో దూకుడు ప్రదర్శించిన సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్‌కు తొలి మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించలేదు. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ కీలక మ్యాచ్‌లోనూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బౌలింగ్‌లో భువీ ఎలాగూ ఫామ్‌లో ఉన్నాడు. కానీ మిగతా బౌలర్ల నుంచి సపోర్ట్ లేకుండా పోతోంది. కీలక పోరులో చాహల్, అక్షర్ పటేల్, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తేనే టీమిండియా గెలుపు మెట్టు ఎక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-06-15T00:11:40+05:30 IST