South Africa vs India: తొలి సెషన్‌ను ఊడ్చిపెట్టేసిన వరుణుడు

ABN , First Publish Date - 2022-01-06T21:25:37+05:30 IST

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట తొలి సెషన్‌ను వరుణుడు ఊడ్చిపెట్టేశాడు.

South Africa vs India: తొలి సెషన్‌ను ఊడ్చిపెట్టేసిన వరుణుడు

జొహన్నెస్‌బర్గ్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట తొలి సెషన్‌ను వరుణుడు ఊడ్చిపెట్టేశాడు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో తొలి సెషన్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. మూడో రోజు ఆటముగిసే సమయానికి సఫారీలు రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేశారు.కెప్టెన్ డీన్ ఎల్గర్ 46, డుసెన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.


దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులు అవసరం కాగా చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత జట్టు విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలంటే మాత్రం 8 వికెట్లు తీయాల్సి ఉంటుంది. భారత బౌలర్లు పోటీపడి వికెట్లు తీస్తే తప్ప అది సాధ్యమయ్యే పనికాదు. తొలి ఇన్నింగ్స్‌లో మ్యాజిక్ చేసిన శార్దూల్ ఠాకూర్ మరోమారు జూలు విదిలిస్తే కనుక అది సాధ్యమే.


ఇక భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో నిన్న 266 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన పుజారా (53), రహానే (58) అర్ధ సెంచరీలతో రాణించారు. హనుమ విహారి 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Updated Date - 2022-01-06T21:25:37+05:30 IST