దున్నేసిన భారత బౌలర్లు.. ఇంగ్లండ్ ఆలౌట్

ABN , First Publish Date - 2021-08-05T03:43:26+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను తొలి ఓవర్‌లోనే బుమ్రా దెబ్బతీశాడు.

దున్నేసిన భారత బౌలర్లు.. ఇంగ్లండ్ ఆలౌట్

ట్రెంట్‌బ్రిడ్జ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను తొలి ఓవర్‌లోనే బుమ్రా దెబ్బతీశాడు. ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు డిఫెన్స్‌లో పడింది. జాక్ క్రాలే(27), డామ్ సిల్బీ(18) ఆచితూచి ఆడటం ప్రారంభించారు. వీరి జోడీని మహమ్మద్ సిరాజ్ విడదీశాడు. ఇంగ్లండ్ స్కోరు 42 వద్ద క్రాలేను అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్ (64) రాణించాడు. దీంతో తొలిరోజు తొలి సెషన్‌ను 64/2తో ఇంగ్లండ్ ముగించింది.


రెండో సెషన్ ఆరంభమే మరోసారి భారత బౌలర్లు దుమ్మురేపారు. షమీ బౌలింగ్‌లో సిబ్లీ షార్ట్ మిడ్ వికెట్‌లో కేఎల్ రాహుల్‌కు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్‌స్టో(29) కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే టీ విరామానికి ముందు బెయిర్‌స్టోను కూడా షమీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అతను ఎల్బీగా పెవిలియన్ చేరాడు. టీ విరామం తర్వాత మరోసారి షమీ మెరిశాడు. లారెన్స్(0) వికెట్ తీశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 138/5తో కష్టాల్లో పడింది. ఆ తర్వాతి ఓవర్లోనే బట్లర్ (0) కూడా బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇలా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను శార్దూల్ ఠాకూర్ గట్టి దెబ్బ కొట్టాడు. అర్థశతకం పూర్తి చేసుకున్న రూట్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.


ఆ తర్వాత రాబిన్‌సన్ కూడా ఖాతా తెరవకుండా అవుట్ అయ్యాడు. అతని వికెట్ కూడా శార్దూల్ ఖాతాలోనే పడింది. దీంతో 60ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 160/8తో నిలిచింది. ఆ వెంటనే స్టువర్ట్ బ్రాడ్ (4) అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులో ఉన్న శామ్ కర్రాన్(27) కొంచెం దూకుడు పెంచాడు. అయితే అతనికి సహకారం అందించే వాళ్లు కరువయ్యారు. అండరసన్ కూడా బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు మొత్తం 183 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, షమీ 3, శార్దూల్ 2, సిరాజ్ 1 వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Updated Date - 2021-08-05T03:43:26+05:30 IST