దంచికొట్టిన ఆసీస్.. విలవిల్లాడిన భారత బౌలర్లు!

ABN , First Publish Date - 2020-11-29T18:44:38+05:30 IST

టీంఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ..

దంచికొట్టిన ఆసీస్.. విలవిల్లాడిన భారత బౌలర్లు!

సిడ్నీ: టీంఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాట్స్‌మెన్ దంచికొట్టారు. వారి ధాటికి భారత బౌలర్లు విలవిల్లాడారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ బ్యాటింగ్ పిచ్ కావడంతో మరోసారి పరుగుల వరద పారింది. కంగారూలను భారత బౌలర్లు ఏమాత్రం నిలువరించలేకపోయారు. మొదటి వన్డేలో 374పరుగులు చేసిన కంగారూలు రెండో వన్డేలో నాలుగు వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేశారు. దీంతో భారత్ ముందు 390పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. స్టీవ్ స్మిత్ మరోసారి మెరుపు శతకం(104, 64బంతుల్లో 14x4,2x6)తో అధరగొట్టాడు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(83, 77బంతుల్లో 7x4, 3x6), ఆరోన్ ఫించ్(60, 69బంతుల్లో 6x4,1x6) మరోసారి శుభారంభం అందించారు. వీరికి లక్సెంబర్గ్(70, 61 బంతుల్లో 5x4) తోడయ్యాడు. మొదటి వన్డేలోలాగే గ్లెన్ మాక్స్‌వెల్ రెండో వన్డేలోనూ ధాటిగా ఆడి కేవలం 29బంతుల్లో 63పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ, హార్ధిక్ పాండ్యా, బుమ్రా తలో వికెట్ తీశారు. వార్నర్ రన్ అవుట్ అయ్యాడు.


టీమిండియాకు చావోరేవో! 

తొలి వన్డేలో సమిష్టి వైఫల్యంతో చిత్తుగా ఓడిన కోహ్లీ సేన.. సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా నెగ్గాలి. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో భారత బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. మొదటి మ్యాచ్‌లో మన బ్యాట్స్‌మెన్‌ షాట్‌ సెలెక్షన్‌ తప్పిదంతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. ఈసారి ఆ లోపాన్ని సవరించుకుని మ్యాచ్‌ను గెలుస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ వన్డేలో ఎలాగైనా టీం ఇండియా మ్యాచ్ నెగ్గి సిరీస్ వేటలోకి రావాలని కోరుకుంటున్నారు. 

 

Updated Date - 2020-11-29T18:44:38+05:30 IST